అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగే శక్తి ఆత్మవిశ్వాసానిది

స్ఫూర్తిగాధ

మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకు కుంగిపోతుంటారు. తమ అపజయాలకు కారణాలను వెతుకుతుంటారు. ఆ కారణాలలో కొన్ని శారీరక కారణాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు. ఏదో ఒక కారణం తమను విజయాన్ని చేరనీయకుండా ఆటంక పరుస్తుందని అనుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే దైవాన్ని కూడా నిందిస్తారు. కానీ తమలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే పెద్ద అవరోధమని గమనించరు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచి కోటానుకోట్ల మందికి స్ఫూర్తిదాయకుడుగా నిలిచిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం...

ఒక బాలుడు జన్మతః చేతులు లేకుండా, పూర్తి కాళ్ళులేకుండా జన్మించాడు. అతని లోపానికి గల కారణాలకు ఏ వైద్యుడూ సరైన వివరణను ఇవ్వలేకపోయాడు. ఆ బాలుడు జన్మించినప్పుడు అతడి తల్లిదండ్రులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. తమ బిడ్డను పెంచడం ఎలాగా, సమాజంలో ఆ బిడ్డ ఏ విధంగా బ్రతుకుతాడో, ఎన్ని అవమానాలకు లోనవుతాడోనని ఆందోళన చెందారు. అనుకున్నట్లుగానే బాల్యం నుంచే ఆ బాలుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తన జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. కానీ అతని తల్లిదండ్రులు అడుగడుగునా అతనికి అండగా నిలిచారు. వైకల్యాన్నే అతని విజయానికి సోపానంగా మార్చుకొనేలా అతడిని తయారుచేశారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైతేనే మనం దైవాన్ని నిందిస్తాం. దేవుడు మనపట్ల నిర్దయుడుగా వ్యవహరించాడని ఆక్రోశిస్తాం. కానీ అతను ఎనాడూ దైవాన్ని నిందించలేదు. పైపెచ్చు తనకు ప్రసాదించిన జీవితానికి గాను దేవుడికి కృతజ్ఞత తెలిపాడు. ఆ బాలుడి పేరు నిక్ వుజిసిచ్ (Nick Vujicic).

నిక్ వుజిసిచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో జన్మించాడు. పుట్టినప్పటి నుండి అతను ఎన్నో సవాళ్ళనూ, అవరోధాలనూ ఎదుర్కొన్నాడు. అతడిని పాఠశాలలో చేర్పించాల్సిన సమయం ఆసన్నమైనపుడు ఆ దేశానికి సంబంధించిన చట్టం ప్రకారం వికలాంగులకు అందరూ చదువుకునే సాధారణ పాఠశాలల్లో ప్రవేశం లభించదు. నిక్ తల్లిదండ్రులు ఆ చట్టాన్ని మార్చడానికి ఒక పెద్ద పోరాటం చేసి విజయం సాధించారు. చివరికి తమ బిడ్డను పాఠశాలలో చేర్పించారు. ఇక్కడి నుండే నిక్ కు అసలు సమస్యలు ఎదురైనాయి. పాఠశాలకు వెళ్ళడమంటే నిక్ కి చాలా ఇష్టం. తనూ అందరిలాగే జీవించాలని తాపత్రయపడ్డాడు. కానీ అందుకు భిన్నంగా పాఠశాలకు వెళ్ళిన కొత్తలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్నవాళ్ళు అతడిని, అతడి అవిటితనాన్నీ అవహేళన చేసేవారు. ఆ పరిస్థితులకు అలవాటుపడడం అతడికెంతో కష్టతరమైంది. అతడి తల్లితండ్రుల సహాయ, సహకారాలతో అటువంటి విపత్కర పరిస్థితుల్ని సునాయాసంగా ఎదుర్కొనే వైఖరినీ, లక్షణాలను పెంపొందించుకున్నాడు.

శారీరకంగా అంగవైకల్యం ఉన్నా, మానసికంగా తాను అందరిలాంటి వాడినేనని పూర్తిగా నమ్మాడు నిక్. పాఠశాలకు వెళ్ళాల్సిన ప్రారంభ దశలో అతడికి ఎదురయిన అనానుకూలతల్ని భరించలేక ఎన్నోసార్లు పాఠశాలకు వెళ్ళకూడదనుకున్నాడు. అతడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాటన్నింటిని అధిగమించి అతను పాఠశాలకు వెళ్లేవాడు. చివరికి అతని తోటి విద్యార్థులు నిక్ కూడా తమలాంటి వాడే అనే భావన కలిగేలా చేయగలిగాడు.

తన పరిస్థితిని తాను మార్చుకోలేడనీ, అందుకు ఎవరిని నిందించాలో తెలియక ఒక్కోసారి నిక్ విపరీతమైన నిస్పృహకు, కోపానికి లోనయ్యేవాడు. తన చుట్టూ ఉన్న వారందరికీ తాను భారం కాకూడదని, వీలైనంత తొందరగా తన జీవితం ముగిసిపోతే బాగుండునని అనేక సందర్భాల్లో నిక్ అనుకునేవాడు. ఇతరులు తనపట్ల చేస్తున్న అవహేళనల కారణంగా ఆత్మన్యూనతాభావం కలిగి, ఒంటరితనంతో కలత చెందిన నిక్, ప్రతికూల పరిస్థితులతో ఎన్నోసార్లు మానసికంగా పోరాడాడు. బాల్యంలోనే తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యంతో ఆ పరిస్థితులను అధిగమించాడు.



ఎవరైనా సరే తమ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొని, వాటిని భగవంతుని అనుగ్రహంగా స్వీకరించాలనేది నిక్ అభిప్రాయం. అందుకే, తన జీవిత అనుభవాలనూ ఇతరులతో పంచుకోవాలని, ఇతరులు కూడా తన లాగే వారి శక్తిని తెలుసుకొని, అవరోధాలను ఎదుర్కొనే ధైర్యం వారికి కలిగించి స్పూర్తినివ్వాలని తన జీవితాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉపన్యాసాలివ్వడం ప్రారంభించాడు. అనేక సమస్యలతో సతమతం అవుతున్న నేటి తరం యువతను మానసికంగా శక్తిమంతులుగా తయారుచేసేందుకు స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నాడు నిక్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అకౌంటింగ్ అనే అంశంతో అర్థశాస్త్రంలో చదువును పూర్తిచేసి తన ఉపన్యాసాలలో భాగంగా అవసరమైన వారికి ఆర్థిక పాఠాలు కూడా బోధిస్తున్నాడు.

పరిస్థితులను యథాతథంగా ఆమోదించరాదనేదే నిక్ నేర్చుకున్న తొలి పాఠం. భగవంతుణ్ణి విశ్వసించిన వారికి భగవంతుడు అన్ని విధాలా సహకరిస్తాడనేది అతడి నమ్మకం. తగిన కారణం లేకుండా భగవంతుడు మనకు జీవితంలో ఏ సమస్యా ఎదురుకానివ్వడు. ఒక వేళ ఏదైనా సమస్య ఎదురైనదంటే మనల్ని మరింత బలమైన మనిషిగా రూపుదిద్దడానికి భగవంతుడే ఆ సమస్యను సృష్టించాడని మనం అర్థం చేసుకోవాలనంటాడు నిక్. ఏదైనా సాధించాలనే తపన, ఉత్సాహం మనలో ఉంటే, అదే భగవంతుని సంకల్పమైతే, ఆ సమయం ఆసన్నమైనపుడు దానిని తప్పక సాధిస్తామనేదే నిక్ ప్రగాఢమైన విశ్వాసం. ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన వక్తగా, ఎంతోమంది జీవితాల్లో ఉత్తేజాన్ని నింపడంలో నిత్యం నిక్ కృతకృత్యుడవుతూనే ఉన్నాడు.

అపజయాలకు కారణాలు వెతుకుతూ, ఆత్మహత్యలకు కూడా వెనకాడని నేటితరం యువతకు నిక్ జీవితం ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అపజయం ఎదురైనంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు. అపజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ, లోపాల్ని సరిద్దుకున్నప్పుడే విజయాల్ని సాధిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించగలము.