మూర్ఖులతో వాదన అనవసర కాలహరణం

 వ్యక్తిత్వ వికాస కథలు 

ఒకానొక అడవిలో గాడిద మరియు పులి నివసిస్తూ ఉండేవి. ఒక రోజు వాటికి గడ్డి ఏ రంగుంలో ఉంటుంది అన్న విషయం మీద వాదోపవాదన జరిగింది.

గాడిద పులితో “గడ్డి నీలం రంగులో ఉంటుంది” అని వాదించసాగింది. దానికి సమాధానంగా పులి “లేదు, గడ్డి ఆకు పచ్చ రంగులో ఉంటుంది” అని వాదించసాగింది.

ఇరువురు నా మాట సరైనదంటే నా మాట సరైనది అని వాదిస్తూ చర్చను మరింత వాడిగా వేడిగా మార్చారు. తమలో ఎవరి మాట నిజమైనదో తెలియాలంటే మధ్యవర్తిత్వమే సరైనదని నిర్ణయించి అడవికి రాజైన సింహం ముందు తమ ఇరువురి వాదనలను వినిపించడానికి బయల్దేరారు.

సింహం వద్దకు వెళ్లిన తరువాత ముందుగా గాడిద “ప్రభూ మీరు గొప్పవారు కాబట్టి మీరే నిర్ణయించండి, గడ్డి నీలం రంగులో ఉంటుందనే మాట వాస్తవమే కదా?” అని తన వాదనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.

దానికి ఏ మాత్రం ఆలోచించకుండా సింహం “నీవు చెప్పింది నిజమని నువ్వు విశ్వసిస్తే, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అని గాడిదకి సమాధానం ఇచ్చింది.


గాడిద రెట్టించిన ఉత్సాహంతో " చూడండి మహారాజా, పులి నాతో ఏకీభవించడంలేదు, నాతో విభేదిస్తూ నాకు కోపం తెప్పించింది. అందుకుగాను దానికి తగిన శిక్ష విధించండి” అని అన్నది.

అప్పుడు సింహం "పులికి మూడు రోజులు మౌనంగా ఉండే శిక్ష విధించబడుతుంది ఇక నువ్వు బయల్దేరు” అని గాడిదకు చెప్పింది.

ఆ సమాధానానికి సంతోషించిన గాడిద “గడ్డి నీలం రంగులో ఉంటుంది, గడ్డి నీలం రంగులో ఉంటుంది” అని పదే పదే అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

గాడిద వెళ్లిపోయిన తరువాత పులి “మహారాజా, గడ్డి ఆకుపచ్చగా ఉంటుందనే విషయం మీకు కూడా తెలుసు కదా మీరు నన్ను ఎందుకు శిక్షించారు?” అని సింహాన్ని అడిగింది.


దానికి బదులుగా సింహం "గడ్డి నీలంగా ఉందా లేదా ఆకుపచ్చగా ఉందా అనే ప్రశ్నకు నీకు ఖచ్చితమైన సమాధానం తెలుసు. ఆ విషయం గురించి అనవసరంగా గాడిదతో వాదిస్తూ సమయం వృధా చేయడం నీలాంటి ధైర్యవంతుడికి, తెలివిగల జీవికీ ఒక శిక్ష లాంటిది. అంతే కాకుండా అటువంటి అనవసరమైన విషయం గురించి నా వద్దకు వచ్చి నా సమయాన్ని వృధా చేశావు. ఇక్కడికి రాకముందే నీకు నిజం తెలుసు కాబట్టి దానిని నిజమని ధృవీకరించడానికి నా దాకా రావాల్సిన అవసరం లేదు” అన్నది.

పై కథను మన నిజ జీవితానికి అన్వయించుకున్నట్లయితే మనం కూడా అనేక సందర్భాల్లో మనకు తెలిసిన ఎన్నో విషయాల మీద ఇతరులతో అనవసర వాదనలు చేస్తూ ఎంతో సమయాన్ని వృధా చేస్తాము. అదే సమయాన్ని మన లక్ష్యాల కోసం, లేదా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వెచ్చిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మనకు ఏదైనా విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటే అనవసర వాదనలకు వెళ్ళకుండా అవతలి వ్యక్తి తనమాటే నిజమని వాదించినంత మాత్రాన మనకు తెలిసిన విషయం వాస్తవం కాకుండా పోదు, పైపెచ్చు వారితో వాదించడం వలన మన అమూల్యమైన సమయం వృధా చేసుకున్నవారం అవుతాము. కాబట్టి కొన్నిసార్లు ఎదుటివారు చెప్పిన విషయాన్ని వాదించకుండా నిజమని ఒప్పుకున్నంత మాత్రాన మనం నష్టపోయేదేమీ లేదు. అర్థం లేని చర్చల కోసం మూర్ఖులతో వాదించి ఎప్పుడూ సమయాన్ని వృథా చేయరాదు. ఎదుటివారు మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునే సామర్థ్యం లేని వ్యక్తులైనపుడు మన మాటలలో ఎంత నిజం ఉన్నా అటువంటి వాదనలో మనం ఎన్నటికి గెలవలేము. గెలవకపోయినా మనకు కలిగే నష్టమేదీ లేదు. అటువంటప్పుడు వాదనలోకి దిగకపోవడమే ఉత్తమం.

అజ్ఞాని అనవసరంగా అరుస్తున్నప్పుడు, తెలివైనవాడు అతణ్ణి ఏ మాత్రం పట్టించుకోకుండా తన దారిలో ముందుకు సాగుతాడు.