మనుగడలో మార్పు సహజం... అనివార్యం ....ఆచరణీయం....

ప్రతి మనిషి తన జీవనంలో అనివార్యమైన కొన్ని మార్పులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండడమే కాకుండా మార్పులను స్వాగతించాలి కూడా. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాలను, పరాజయాల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా సరికొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి ప్రతిక్షణం అప్రమత్తుడై ఉండాలి. జీవితంలో ప్రతి దశలో ఏదో ఒక సంఘర్షణను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో చావో, రేవో అన్న పరిస్థితులు కూడా కలుగుతాయి. ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడే మన మేధస్సుకు పదును పెట్టడం ద్వారా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవాలి. విజయం సాధించాలని తపన పడే ప్రతి ఒక్కరూ వారి పరిధిలో సంభవించే నూతన పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా తమ సృజనాత్మక విధానాలకు అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవాలి.

కాలంచెల్లిన విధానాల నుండి బైటపడలేక వాటినే పట్టుకొని వేళ్ళాడుతూ ఉండటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎటువంటి ఆటంకం లేని ప్రవాహంలా జీవితం నిరంతర సాగిపోవాలంటే ఎప్పటికప్పుడు మన మనస్సులో నూతనోత్సాహాన్ని నింపుకోవాలి. మన ఉనికికి భంగం కలిగే పరిస్థితులు ఎదురైనా వాటికి ధైర్యంగా ఎదురొడ్డి ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సమస్యలకు కూడా సిద్ధమవ్వాలి. పరిస్థితులనేవి ఎవరికీ ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అలా ఉండాలని కూడా అనుకోరాదు. పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటూ పోవడం వల్లనే జీవితంలో విజయం సాధించగలము.

ఏ పని చేస్తే ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని భయపడే వారు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు. అసలు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడే కదా మనం చేయగలమా, లేదా అని తెలిసేది. గొంగళిపురుగు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురైతే గానీ అందమైన సీతాకోకచిలుకగా పరిణామం చెందడం కుదరదు. అదే విధంగా మనిషి కూడా ఎన్నో రకాలైన మానసిక ఒత్తిళ్ళను, సవాళ్ళను ఎదుర్కొంటే గానీ ప్రగతిని సాధించలేడు. అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నత స్థితికి చేరిన విజేతల జీవన ప్రస్థానాన్ని గమనిస్తే, వారు ఎన్నో కఠినతరమైన దశలను అధిగమించి విజయతీరాలకు చేరి ఉంటారు. తమ జీవన గమనంలో సంభవించిన మార్పులను అంగీకరిస్తూ తదనుగుణంగా మనుగడను నిర్దేశించుకున్నారు కాబట్టే వారు విజేతలైనారు.

ఇందుకు సంబంధించి ఉదాహరణను పరిశీలిద్దాం....

సాధారణంగా గరుడపక్షి జీవిత కాలం పక్షులలోకెల్లా ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ పక్షి తన జీవన గమనంలో ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటుందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. గరుడపక్షి ఎంత ఎక్కువ కాలం బ్రతకాలంటే అంత ఎక్కువ సంఘర్షణను అనుభవించాల్సి ఉంటుంది. సగం జీవితం గడిచిన తరువాత దాని శరీర అవయవాలు దానికి సహకరించడం మానేస్తాయి. తన ఆహార అన్వేషణలో భాగంగా వేటాడడం వలన గోళ్ళు వంగిపోతాయి. పదునుగా ఉండే ముక్కు మొండిగా మారిపోతుంది. దాని రెక్కలు సైతం భారంగా మారి ఎగరడానికి కష్టమవుతుంది.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గరుడపక్షి ఎదురుగా రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఒకటి జీవితాన్ని ముంగించేయడం, రెండోది తిరిగి తన శరీర భాగాలను పునరుజ్జీవింప చేయడం. అయితే ఓటమిని అంగీకరించని గరుడపక్షి దూరతీరాల్లో ఉన్న పర్వతాలపై తన గూటిలోకి చేరి, కొన్ని నెలల పాటు శారీరకంగా కలిగిన బాధలన్నింటిని ఓర్చుకొని తన జీవన పోరాటానికి సిద్ధమవుతుంది. మొండిగా మారిన ముక్కు పదును తేలే వరకూ రాళ్ళపై రాపిడి చేస్తుంది. వంగిపోయిన తన గోళ్ళను తాను పీకేసుకుని కొత్త గోళ్ళు వచ్చేదాకా వేచి చూస్తుంది. ఆ తరువాత మొనదేలిన ముక్కుతో అంతకుముందున్న రెక్కలను కూడా పీకేసుకుంటుంది. కొంతకాలం గడిచిన తరువాత ఏర్పడే సరికొత్త శరీర భాగాలతో నూతనోత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.

ఒక పక్షి తన జీవన గమనంలో సంభవించే సంఘర్షణను ఎదుర్కొని విజయవంతమైనప్పుడు, ఎంతో మేధస్సు కలిగి, అపారమైన అవకాశాలు కలిగిన మనుషులు మాత్రం తమకు కలిగే సంఘర్షణలను ఎదుర్కొని విజయం సాధించలేరా! ఆలోచించండి......