విజయ పథంలో పయనం


మన నిర్ణయ సామర్ధ్యమే మన ఉన్నత లేదా అథః స్థితిని నిర్ణయిస్తుంది. అందుకే విజయసాధనలో భాగంగా మనం ఒక నిర్ణయం తీసుకునేముందు అత్యంత జాగరూకులై ఉండాలి. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి ఆచి, తూచి ముందడుగు వేయాలి. కొన్నిసార్లు చిన్న విషయమేగా అని మనం ప్రదర్సించే బాధ్యతారహిత్యమే మనకు పెద్దముప్పు తెచ్చి పెడుతుంది. ఆ తరువాత దానికి భారీ చెల్లించే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

విజయ సాధనలో ఒకానొక సందర్భంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. అటువంటి సమయంలో ఎలాంటి సంకోచం లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మనం ఎంచుకున్న రంగంలో అనుభవం గడించిన వారిని సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు. ఒకవేళ వారికి పూర్తి విషయ పరిజ్ఞానం లేకపోయినా వారితో మాట్లాడడం ద్వారా ఎంతోకొంత ఉపయోగమైతే తప్పకుండా ఉంటుంది. నిర్ణయాన్ని అమలు పరచుకునేముందు పునరాలోచన చేసుకుని అమలు చేయాలి. ఏదైనా పని చేసే ముందు తదనంతర పరిణామాలను సైతం దృష్టిలో ఉంచుకొంటే ఎటువంటి ప్రమాదాలు తలెత్తవు. విజయానికి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం వంటి అవలక్షణాలను త్యజిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది.

జీవితం జయాపజయాల కలయిక అని మరవకూడదు. ప్రతి మనిషికీ తాను ఎంచుకున్న రంగంలో లేదా దైనందిన జీవితంలో కొన్ని విజయాలు కొన్ని అపజయాలు ఉంటాయి. అపజయాలను మాత్రమే గుర్తుంచుకుని సాధించిన విజయాలను మరిచిపోయి, ఎప్పటికీ అపజయాల గురించే ఆలోచిస్తూ ఉండడం వలన విజయ సాధనకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధించిన చిన్న విజయాన్ని కూడా భవిషత్తులో సాధించబోయే పెద్ద విజయానికి నాందిగా భావించాలి. అపజయాలు విజయానికి సోపానాలని గుర్తుంచుకోవాలి. సానుకూల దృక్పథం అవరచుకోవడం ద్వారా జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుంది.

విజయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇందులో తృప్తిపడేందుకు చోటు లేదు. అది సరియైన విధానం కూడా కాదు. ప్రతి రోజును ఏ విధంగా సద్వినియోగపరుచుకున్నామనే విషయాన్ని సమీక్ష చేసుకోవాలి. అనవసర పనులతో వృధా కాలయాపన చేయడం మానుకోవాలి. గడిచిన కాలం తిరిగిరాదనే విషయాన్ని ప్రతి నిమిషం గుర్తుచేసుకుంటూ ఉండాలి. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటూ సరైన ప్రణాళికలను రూపొందించుకోవడం విజయసాధనలో అత్యంతావశ్యకం.

లక్ష్యసాధనలో ఎదురైన వైఫల్యాలను కూడా సమీక్షించుకోవాలి. కేవలం సమీక్షించుకోవడమే కాకుండా వాటిని అధిగమించే విధానాల గురించి కూడా ఆలోచించాలి. ఏదైనా పనిచేయడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఆసక్తి. పనికి సంబంధించి ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఆ పనికి సంబంధించిన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సేకరించుకోవచ్చు. పని సాధనకు నైపుణ్యాలతోపాటు దానిలోని లోతుపాతులు, దానికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడం వలన ఎంచుకున్న రంగంలో అగ్రగామిగా నిలవడానికి అవకాశం ఉంటుంది. అందుకే సమీక్షలు, అవగాహనలు, ప్రణాళికలు, ఆచరణలు, విజయసాధనకు చాలా అవసరం. ఏ పనిలో విజయం సాధించాలన్నా దృష్టి దానిమీద కేంద్రీకరించి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అపజయం అన్నది మన దరికి చేరదు.

లక్ష్యానికి సంబంధించి ‘సరదాకోసం ప్రయత్నించాను' 'నేను పెద్దగా పట్టించుకోలేదు' వంటి పదజాలాన్ని విజయసాధకులు ఎన్నటికీ వాడకూడదు. చేసే పనుల్లో ప్రాధాన్యతాక్రమాన్ని ఏర్పరచుకోవడం వలన సరైన సమయానికి పనులు పూర్తవుతాయి. లక్ష్యసాధన ఒక తపస్సు మాదిరిగా చేస్తేనే విజయానికి చేరువకావచ్చు. ఎవరికి వారే తమ శక్తులను, ప్రతిభలను గుర్తించి తపనతో ముందడుగు వేస్తే విజయాలు పాదాక్రాంతమవుతాయి.

విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయాలు :

  • నియమబద్దమైన జీవనం సాగించాలి
  • ఆచరణ నిర్మలంగా ఉండాలి
  • నిర్ణయ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి
  • చేయాల్సిన పనులు నిశ్చయంగా చేయాలి
  • కోరికలు, ఆశలు అదుపులో ఉండాలి
  • మనసులో ప్రవేశించే వ్యతిరేక భావాలను ఎప్పటికప్పుడు తుడిచివేస్తూండాలి.
  • దురలవాట్లు, విసుగు ఎన్నటికీ దరిచేరకూడదు