ప్రేరణ...విజయానికి ఒక బలమైన చోదక శక్తి


ప్రేరణ అనేది అత్యంత బలమైన చర్య. మనల్ని ప్రోత్సహించి, మనమీద నమ్మకం కలిగించి, మనం పూర్తిగా సాధనలో మునిగేలా చేయగలదు. మరో రకంగా చూస్తే మనం ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రేరకశక్తిగా ప్రేరణను పేర్కొనవచ్చు. మన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతమైన శక్తి ప్రేరణకు కలదు.

రకరకాలుగా ప్రేరణ కలిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ అన్నిటికంటే ఉత్తమమైనది మనల్ని మనం ప్రేరేపించుకోవడం. దీనిని స్వీయ ప్రేరణ అని కూడా అనవచ్చు. మన లక్ష్య సాధనలో ప్రేరణ తప్పనిసరిగా ఒక భాగంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఏ బాహ్య ప్రేరణ మనల్ని ప్రేరేపితుల్ని చేయనప్పుడు ప్రేరణ అన్నది మనలో అంతర్గతంగా జరగాలి.

స్వీయ ప్రేరణకు గాను కొన్ని మార్గాలను ఎంచుకోవాలి. ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడం ద్వారా వారి జీవితాన్నుండి ప్రేరణ పొందాలి. మనం ప్రేరణ పొందాలనుకున్న వ్యక్తులు ప్రసుత్తం జీవించి ఉండవచ్చు లేదా అంతకు ముందే కాల గమనంలో కలిసి పోయి ఉండవచ్చు. ఆయా వ్యక్తుల గురించి లోతుగా అధ్యయనం చేసి వారి విజయం వెనుక వున్న ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమను గురించి తెలుసుకోవడం వలన మనకు అంతఃశ్చేతన ఏర్పడి తద్వారా ప్రేరణ కలుగుతుంది. మనల్ని ప్రేరేపితుల్ని చేసే వ్యక్తులకు సంబంధించిన విషయాలను అన్నిటినీ కాకపోయినా కొన్ని మనకు ఆచరణయోగ్యమైనవి ఆచరించి తద్వారా మన సాధన కొనసాగించవచ్చు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంటుంది. మనకు ఆదర్శప్రాయుడైన వ్యక్తి నుండి ప్రేరణ మాత్రమే పొందాలి అతడిని అనుకరించకూడదు. అనుకరణ అనేది మనలోని సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్ఫుట పరుస్తూ స్వామి వివేకానంద “ఇతరుల నుండి మంచినంతా నేర్చుకో! సాధ్యమైనంత సారాన్ని గ్రహించు! నీకు స్వాభావికమైన మార్గంలో దాన్ని జీర్ణం చేసుకో! అంతేగాని పరుల వేషం మాత్రం వేయాలనే ప్రయత్నం ఎన్నటికీ చేయకు” అన్నారు.

మనకు ప్రేరణను కలిగించే చిత్రాలను మనం నివసిస్తున్న పరిసరాల్లో ఉంచుకోవడం కూడా కొంత వరకు మేలు చేస్తుంది. మనకు చిత్రాలు ఇచ్చినంత ప్రేరణ మరేవీ ఇవ్వలేవు. ఈ విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన లక్ష్యాలకు సంబంధించిన చిత్రాలు ఎప్పుడూ మన ముందుండేలా చూసుకోవాలి. లక్ష్యసాధనకు సంబంధించి ఉత్తేజం కలిగించే సూక్తులను కనపడేలా గోడల మీద అతికించుకోవాలి. ప్రేరణ కలిగించే మాటలు లేదా పాటలు వినడం కూడా కొంత వరకు ఫలితాన్నిస్తుంది. లక్ష్యసాధనలో ఉన్నప్పుడు ఎవరైనా మీరు సాధించలేరని నిరుత్సాహ పరిచినా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించినా అటువంటి మాటలకు బాధపడకుండా దానిని సైతం ఒక సవాలుగా తీసుకోవడం వలన మనలో ఒక విధమైనటువంటి పోటీతత్త్వం పెంపొందుతుంది. .

లక్ష్య సాధనకు సంబంధించి ఏదో ఒక పనిని నిరంతరం చేస్తూ ఉండాలి. కేవలం జ్ఞాన సముపార్జన మాత్రమే మనల్ని గమ్యానికి చేర్చదు. మనం చేసే పనులు మాత్రమే మనల్ని అనుకున్న దరికి చేరుస్తాయి. లక్ష్యాల వల్ల కలిగే లాభాలను వ్రాసుకోవడం కూడా మేలు చేస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయో ముందే వ్రాసుకుని, అప్పుడప్పుడు వాటిని మననం చేసుకోవడం, వాటి గురించి మాట్లాడటం ద్వారా చక్కని స్వీయ ప్రేరణ కలుగుతుంది.

మన లక్ష్యాన్ని నిర్భయంగా నలుగురికి ప్రకటించాలి. జీవితాశయం అంతిమ లక్ష్యం ఎవరికి చెప్పనవసరం లేదు గానీ ప్రస్తుత లక్ష్యాలను గురించి ఎవరికైనా చెప్పవచ్చు. అందరూ కాకపోయినా కొందరైనా మన లక్ష్యాన్ని గౌరవించే అవకాశం ఉంటుంది. అటువంటి వారు మనం వారిని కలిసిన ప్రతిసారీ మన లక్ష్యాలను గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన లక్ష్యంమీద నమ్మకం ఉన్నవారు మన లక్ష్య సాధనకు సంబంధించిన అంశాల గురించి వారికి తెలిసిన సమాచారాన్ని కూడా మనకు తెలియచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన లక్ష్యసాధనలో ఇతరులు కూడా భాగస్వాములవుతారు. వారి మాటలతో కూడా మనకు ప్రేరణ కలుగుతుంది.

సర్వదా మంచిగా మాటలాడాలి. మానవ జీవితం అంతా భావనలు, హక్కులు, పనులతో నిండి వుంది. ఏ పనైనా సరే మనసా, వాచా, కర్మణా ఆచరణ ద్వారా ఖచ్చితంగా నెరవేరుతుంది. విజయం అనే అమృతం దక్కాలంటే చెడు మాటలు అనే విషాన్ని సేవించాల్సి ఉంటుంది. అయితే దానిని కంఠం వరకే ఆపగలగాలి. ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మౌనంగా విని మన సమాధానం లక్ష్యం పూర్తిచేయడం ద్వారా చెప్పాలి.

తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అనే సూత్రాన్ని పాటించాలి. ఏ రంగంలోనై విజయం సాధించిన వారిని గమనిస్తే వారు మితభాషులుగా ఉంటారు. పనిలో చురుకుగా ఉంటారు. వీరు ఉత్తమ శ్రోతలుగా కూడా ఉంటారు. అనవసర మాటల వలన మనలోని శక్తి వృధా అవడమే కాకుండా అవసరమైన పనిచేయడానికి తగిన శక్తిని కోల్పోతాము. అందుకే మనం ఎప్పటికీ ఉత్తమ శ్రోతలుగా ఉండాలి.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆందోళన చెందక పరిష్కారం గురించి ఆలోచించాలి. రకరకాల పరిష్కారాలు అన్నీ చూసిన తరువాత మన మనసు అంతిమ తీర్పు చెపుతుంది. అది ఒక పరిష్కారం కావచ్చు లేదా కొన్ని పరిష్కారాల సమూహం కావచ్చు. విలువైన ముత్యాలు అగాధ సముద్ర గర్భంలో వున్నట్లే సుఖాలన్నీ దుఖఃసాగరంలోనే దాగుంటాయి. జీవితాన్ని తెలివిగా నడుపుకున్నప్పుడే ఆ సుఖాలను ఆస్వాదించే వీలుంటుంది.

చివరగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి... సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి... సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోకపోవడం నిజంగా నేరంగా పరిగణించబడుతుంది. నిర్దేశించుకునే లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగానే వుండాలి. లక్ష్య సాధనలో వైఫల్యాలు ఎదురైనా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భయపడితే ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికి విజేతలు కాలేరు. సరికొత్త మార్గాల్లో ప్రయాణించే వారే ఇప్పటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు. అందరూ నడిచే బాటలో మనమూ నడిస్తే వెనకే ఉంటాము. ఎవరైతే తమదైన దారిని వెతుక్కుని తాము నమ్మిన దారిలో నడుస్తారో వారు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు.