మన సంకల్పం దృఢంగా ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రకృతి, మనుషులు చివరికి దైవ సహకారం కూడా లభిస్తుంది. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.
ఒక సముద్రపు ఒడ్డున పక్షి జంట నివసిస్తూ ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టిన ప్రతిసారీ సముద్రం వాటిని తన అలలతో తీసుకొని పోయేది. ఇలా చాలాసార్లు జరగడంతో మనస్తాపం చెందిన పక్షులు కోపంతో ఏకంగా సముద్రాన్నే కప్పేద్దామని నిర్ణయించాయి. అవి చిన్న పక్షులైనప్పటికీ సముద్రంలోకి వెళ్ళి వాటి రెక్కలను తడిపి సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకను రెక్కలకు అంటించుకుని సముద్రంలో ఆ ఇసుకను జాడించి సముద్రాన్ని కప్పేయాలని ప్రయత్నం చేయసాగాయి.
ఇది గమనించిన మిగతా పక్షులు అసలు “మీరేం చేస్తున్నారు” అని అడిగాయి.
అందుకు ఆ పక్షిజంట సముద్రం తమ గుడ్లను మింగేస్తోందని, అందుకు ప్రతీకారంగా సముద్రాన్ని ఇసుకతో కప్పేయాలని నిర్ణయించామని చెప్పాయి. మొదట మిగతా పక్షులు వాటి చర్యకు నవ్వుకున్నా, తరువాత ఆ పక్షిజంట సంకల్పానికి మెచ్చి తామందరము కూడా వాటికి సహాయం చేయాలని పక్షులన్నీ కూడా ఏకమై సముద్రంలోకి ఇసుకను వేయసాగాయి. ఇలా రోజు రోజుకీ పక్షుల సంఖ్య పెరిగి తమ పక్షిజాతికి చెందిన వారికి కష్టం వచ్చింది, వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి రకరకాల జాతులకు చెందిన పక్షులన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనసాగాయి. ఈ విషయం చివరికి పక్షిరాజైన గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. ఆయన కూడా భూలోకానికి తరలి వచ్చి తన శక్తిమేర బండరాళ్ళను మోసి సముద్రంలో వేయసాగాడు.
తన వాహనమైన గరుత్మంతుడు వైకుంఠంలో కనిపించకపోవడంతో ఏమయ్యాడని విష్ణుమూర్తి ఆరాతీయగా ఆయనకి ఈ పక్షులన్నీ కలిసి చేస్తున్న విషయం తెలిసింది. చివరికి భగవంతుడు కూడా భూలోకానికి తరలి వచ్చి గరుత్మంతుణ్ణి అసలు ఏ జరుగుతోందిని ప్రశ్నించగా, గరుత్మంతుడు తమ జాతికి చెందిన రెండు పక్షులకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. భగవంతుడి రాకను గమనించిన సముద్రుడు సైతం ప్రత్యక్షమయ్యాడు. ఆ రెండు పక్షులకు సంబంధించిన గుడ్లను తిరిగి ఇచ్చేయవలసిందిగా భగవంతుడు సముద్రుడిని ఆదేశించాడు. భగవదాజ్ఞను శిరసావహించి సముద్రుడు గుడ్లను తిరిగి ఇచ్చేశాడు. ఈ విధంగా రెండు చిన్న పక్షులు సాగించిన అకుంఠిత దీక్షకు భగవంతుడు సైతం సహకరించాడు.
మన సంకల్పబలం గొప్పదైతే మనకు ఇతరుల నుండి సహకారం తప్పక లభిస్తుంది. మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఎగతాళి చేసిన వారు సైతం మన దృఢ నిశ్చయాన్ని చూసి అబ్బుర పడి మన వెంట నిలుస్తారు. దానికి ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేయగలిగిన పని తప్పకుండా పూర్తిచేస్తామని ధీమావ్యక్తం చేయగలగాలి. అప్పుడే అన్ని రకాల అనుకూలతలు ఏర్పడి తప్పక విజయం సాధించగలుగుతాము.