విజయానికి కొలమానం


జీవితంలో మనం సాధించిన లక్ష్యాన్ని బట్టి లేదా చేరిన స్థానాన్ని బట్టి కాకుండా ఆ లక్ష్యాన్ని చేరడానికి మనం ఎన్ని అవరోధాలను దాటి వచ్చామనే విషయం ఆధారంగా విజయం యొక్క స్థాయిని అంచనా వేయవచ్చు.

విజయసాధనలో భాగంగా మనం ఇతరులతో పోల్చుకొని వారి కన్నా బాగా పనిచేస్తున్నామా లేదా అని ఆలోచించడం కన్నా, మనతో మనమే పోల్చుకుని ఇంకా మెరుగ్గా ఎలా పనిచేయాలా అని ఆలోచించడంలోనే అసలైన విజయ రహస్యం ఇమిడి ఉన్నది. ఉదాహరణకు ఒక పదవ తరగతి విద్యార్థి తరగతిలో బాగా చదివే 10 మంది ఉత్తమ విద్యార్థుల్లో ఒకడైనప్పుడు అతను మిగతా తొమ్మిది మందితో తనను తాను పోల్చుకోకుండా క్రితం పరీక్షల్లో తాను సాధించిన మార్కులతో ప్రస్తుతం సాధించిన మార్కులను బేరీజు వేసుకోవడం ద్వారా తాను ఎంత మెరుగ్గా ఉన్నాననే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. తనతో తానే పోటీపడడమనేది ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని సూచిస్తుంది. అదే ఇతరులతో పోల్చుకోవడం వలన వారికంటే తక్కువ మార్కులు లేదా స్థాయిని పొందితే నిరాశకు గురై ఆత్మన్యూనతా భావానికి లోనవ్వాల్సి వస్తుంది. అది పరాజయాలకి ఒక ముఖ్య హేతువుగా కూడా మారుతుంది.

అదే విధంగా దైనందిన జీవితంలో కూడా ఇతరుల స్థితిగతులతో పోల్చుకోకుండా మనం గతంలో ఉన్న స్థితి కంటే నేడు మంచి స్థితిలో ఉన్నామా లేదా అని బేరీజు వేసుకుంటే విజయం వైపు పయనిస్తున్నామా లేదా అనే విషయంలో స్పష్టత వస్తుంది. ఒకవేళ గతంకంటే మన స్థితి దిగజారి వుంటే దానిని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. అదే ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మిగతా వారి గురించే ఆలోచిస్తాము కాని మన గురించి ఎన్నటికీ ఆలోచించలేము. విజయం సాధించిన వారినెవరినైనా అడిగితే తమతో తాము పోటీపడడమే తమ విజయానికి కారణమని ఖచ్చితంగా చెబుతారు. ఇటువంటి వారు తమ సాధనను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించడం వలన నిరంతరం విజయాలను సాధిస్తూనే ఉంటారు.

జీవితంలో మనం ఎంత ఎత్తుకి ఎదిగామనే విషయం నుండి కాకుండా ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాము, అవరోధాలు ఎదురైనప్పుడు మనం స్పందించిన తీరు అదేవిధంగా ఎన్నిసార్లు ఓటమి ఎదుర్కొని విజయాన్ని సాధించాము అనే విషయాలు విజయానికి కొలమానాలుగా నిలుస్తాయి. ఒక వ్యక్తి విజయం సాధించిన తరువాత అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఆ విజయం సాధించడానికి పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు మొదలైనవన్నీ లెక్కలోకి తీసుకుని విజయాన్ని కొలిచినప్పుడే దానికి సంబంధించిన ఖచ్చితత్వం తెలుస్తుంది. నేలపై విసిరిన బంతి ఏ స్థాయిలో తిరిగి పైకి లేస్తుందో అదే విధంగా కింద పడిన ప్రతి సారి మనం ఎంత త్వరగా పైకి లేచి విజయం వైపు పయనిస్తున్నామనేదే మన విజయాన్ని నిర్ధారిస్తుంది.

విజయాన్ని చేజిక్కించుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకస్థాయిలో పూర్తిగా కిందిస్థాయికి పడిపోయి తిరిగి శక్తిని కూడగట్టి పైకి లేచిన వారే. విజేతకు పరాజితుడికి తేడా ఏమిటంటే ఒకసారి అవరోధం ఎదురవగానే పరాజితుడు తిరిగి ప్రయత్నించడు. కానీ విజేత అలా కాకుండా ఎన్నిసార్లు అవరోధాలు ఎదురైనా విజయశిఖరం చేరే వరకూ పోరాట పటిమిను ప్రదర్శిస్తూనే ఉంటాడు. చివరికి విజయం సాధిస్తాడు. కాకపోతే సాధనలో తాత్కాలిక విరామాన్ని ఇవ్వవచ్చు కానీ పూర్తిగా నిరాశచెంది లక్ష్యాన్ని మాత్రం ఎన్నటికీ వదలడు.

ఓటమి విజయానికి రహదారి మాత్రమే అని గమనించాలి. చరిత్రను తరచిచూస్తే విజయగాధలన్నీ ఓటమితోనే మొదలవుతాయి.

కానీ ఓటమిని గురించి ఎవరూ పట్టించుకోరు. అంతిమంగా ప్రపంచానికి కావాల్సింది కేవలం విజయం మాత్రమే.