ప్రయత్నమే మొదటి విజయం... నిరంతర ప్రయత్నంతోనే అంతిమ విజయం సాధ్యం

ఇది ముమ్మాటికీ నిజమే.. ఏదైనా విజయం సాధించాలంటే ముందు ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం ప్రారంభించామంటే సగం విజయం సాధించనట్లే. ఏదయినా పని ప్రారంభించినపుడు ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా, కేవలం విజయం సాధిస్తామనే నమ్మకంతోనే ప్రయత్నం ప్రారంభించాలి. ఉత్తమ ప్రయత్నంలో భాగంగా కలిగిన ఓటమి కూడా అంతిమ విజయంతో సమానమే.

చేస్తున్న ప్రయత్నంలో ఓటమి సంభవిస్తే ఇక ప్రయత్నాన్ని ఆపేయాలని అర్థం కాదు. విజయం సాధించడానికి మరింత గొప్పగా పోరాడే అవకాశం లభించిందని గ్రహించగలగాలి. విజయసాధనలో భాగంగా ఎదురయ్యే ఓటములనబడే రాళ్ళను మన విజయసాధనలో మెట్లలాగా పేర్చుకొంటూ వెళ్ళాలే తప్ప ప్రయాణాన్ని ఆపకూడదు. చిన్నతనంలో మొదటిసారి నడక మొదలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా కింద పడతారు. నడవాలనే కోరికతో మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నం చేస్తారు. కాలక్రమేణా నడవడం అలవాటు చేసుకుంటారు. ఒకసారి కింద పడిపోయామని నడవడం మానేయలేదుకదా. అలా మానేస్తే ఇప్పటికి మనందరం నేలమీద పాకుతూ ఉండేవాళ్ళం. ఏమీ తెలియని పసి వయస్సులోనే కిందపడినప్పుడు మళ్ళీ పైకిలేచి నడిచే ప్రయత్నం చేసి పూర్తిగా నడవడం నేర్చుకోవడమే మన జీవితంలో సాధించిన మొదటి విజయం. అదేవిధంగా జీవన పోరాటంలో కూడా ఎన్నోసార్లు కింద పడిపోతుంటాము. వైఫల్యాలు ఎదుర్కొంటూ ఉంటాము. అంతమాత్రం చేత ప్రయత్నాలు మానేయరాదు.

అమెరికా మాజీ అధ్యక్షుడు 'అబ్రహం లింకన్' సామాన్య మానవుడిగా జీవితాన్ని ప్రారంభించి 1831లో వ్యాపారాన్ని ప్రారంభించి భయంకరమైన నష్టాలు చవిచూశాడు. సంపాదించిన ధనమంతా వ్యాపారంలో నష్టపోయాడు. ఆ తరువాత లెజిస్లేచర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైనాడు. మరుసటి సంవత్సరం తాను రాజకీయాలకు పనికి రానేమోనని భావించి మళ్ళీ వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఈ సారి కూడా అతణ్ణి దురదృష్టం వెంటాడింది. మళ్ళీ వ్యాపారంలో నష్టం వాటిల్లింది.

1833లో వ్యాపారం తన వల్ల కాదని, రాజకీయాల్లోనే రాణించాలని సంకల్పించి 1834లో మళ్ళీ లెజిస్లేచర్ పదవికి పోటీచేశాడు. కానీ ఈ సారి కూడా ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు. 1835లో అతడు ప్రాణప్రదంగా ప్రేమించే జీవితభాగస్వామి అతడిని వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. సాధారణ వ్యక్తులెవరైనా ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతారు. కానీ అబ్రహం లింకన్ మాత్రం అంతులేని మనోధైర్యాన్ని కూడగట్టుకుని, పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నాడు.

1837లో స్పీకర్ పదవికి పోటీచేసి ఓడిపోయాడు. 1846, 1848లలో కాంగ్రెస్ ఎన్నికలలో అపజయం చవిచూశాడు. 1855లో సెనెట్ ఎన్నికలలో ఓటమి వరించింది. వరుస పరాజయాలు ఎదురయినా మొక్కవోని దీక్షతో, తన అలుపెరుగని పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. 1856లో జరిగిన దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీచేసి అందులో కూడా అపజయం పాలయ్యాడు. ఇంతటి కఠిన పరిస్థితులెదురైనా అబ్రహం లింకన్ మాత్రం దృఢచిత్తంతో పరిస్థితులకు ఎదురునిలిచి పోరాడుతున్నాడే కానీ నిరాశను మాత్రం తన దరికి చేరనీయలేదు. 1858లో మరోసారి సెనెట్ ఎన్నికలలో అపజయాన్ని ఎదుర్కొన్నాడు. 1860లో దేశాధ్యక్ష పదవికి పోటీచేశాడు. కానీ ఈ సారి అబ్రహం లింకన్ పట్టుదల ముందు ఓటమి నిలువలేక పలాయనం చిత్తగించింది. ఎట్టకేలకు లింకన్ ను విజయం వరించింది. తన దేశంలోని అత్యున్నత పదవికి అతను ఎన్నిక కాబడినాడు. చిన్న చిన్న ఓటములకే జీవితం ముగిసిపోయిందని భావించే వారికి, ప్రతి పరాజయాన్ని ఒక కొత్త అవకాశంగా భావిస్తూ తన జీవన గమనంలో నిరంతరం యుద్ధం చేస్తూ చివరికి విజేతగా నిలిచి, దేశాధ్యక్ష పదవిని చేపట్టిన అబ్రహం లింకన్ జీవితం ఆదర్శనీయమైనది.