ఏ కార్యమైన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. సాధన ద్వారా సాధించలేని కార్యం ఏదీ లేదు. కానీ దానికి కావలసింది కర్తవ్యనిష్ఠ, చిత్తశుద్ధి. లక్ష్యం ఎంత కష్టమైనదైనా సరే నిత్యం సాధనచేయడం ద్వారా తప్పక విజయం సాధించవచ్చు. ఏదైనా ఒక పని మొదలు పెట్టి సాధన చేస్తున్నప్పుడు మనస్సులో అనేక ఆలోచనలు మనల్ని ఆటంక పరుస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటినీ పక్కకు నెట్టి మనస్సును లక్ష్యంవైపు మళ్ళించేందుకు సాధన చేయాలి. సరైన దిశగా అభ్యాసం చేస్తూ మనస్సును ఎంచుకున్న లక్ష్యంమీదనే నిలిపి నిష్ఠతో పని చేయడం వలన చేసే పనిలో ప్రావీణ్యత సాధించవచ్చు.
మనం ఎంచుకున్న లక్ష్యం బజారులో దొరికే వస్తువు ఎంతమాత్రమూ కాదు. అది అంత సులభంగా లభించదు. దానిని పొందడానికి మనం అర్హులమా కాదా, ఇంకా ఎంత సాధన చేయాలో వంటి విషయాలు కాలక్రమేణా మనకే తెలుస్తాయి. ఒక్కోసారి చేస్తున్న పనిమీద మనస్సు నిలవదు, పరిపరి విధాలా ఆలోచనలు మనల్ని వెంటాడుతుంటాయి. ఇటువంటి సమయంలోనే మనస్సుపై నియంత్రణ సాధించి చేస్తున్న పనిమీద మనస్సును లగ్నంచేసి పదే పదే అదే పనిని చేస్తూ ఉండడం, ఆ పనిని మరింత బాగా ఎలా చేయగలమని ఆలోచించగలగాలి. చేస్తున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో తెలియజేయడానికి అవసరమైన గురువుగా మన మనస్సునే భావిస్తే అదే మనల్ని సరైన మార్గంలో పయనించేలాగా ప్రోత్సహిస్తుంది. మన వైపు నుండి గొప్ప ప్రయత్నం అనేది లేకుండా ఏ కార్యం నెరవేరదనే విషయం మాత్రం ఖచ్చితంగా గమనించాలి
ఒక అభ్యర్థి తాను ఐ.ఎ.ఎస్.కు ఎంపిక కావాలనే లక్ష్యాన్ని ఎంచుకుంటే ముందుగా దానికి సంబంధించిన సన్నద్ధతను ప్రారంభించాలి. ఒక సంవత్సరం సన్నద్ధత పూర్తయిన తరువాత అతను రాసిన పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేక పోవచ్చు. అప్పుడు అతను మరుసటి సంవత్సరం పరీక్ష కొరకు తన సన్నద్ధతను మరింతగా పెంచాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ నిరంతరం తన సన్నద్ధతను మెరుగు పరుచుకుంటూ ఉంటే అతను చివరికి తప్పక లక్ష్యాన్ని సాధిస్తాడు. అంతేకానీ ఐ.ఎ.ఎస్. అవ్వాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రోజు నుండి తాను ఐ.ఎ.ఎస్.అయినట్లు, ఒక జిల్లా కలెక్టర్ గా నియమింతుడైనట్లు, తన ఆధీనంలో అనేక మంది పనిచేస్తున్నట్లు ముందే ఊహించుకుంటే ప్రయోజనం లేదు. ఇవన్నీ జరగాలంటే ముందు అతను కష్టపడి చదవాలి, పరీక్ష రాయడానికి సాధన చేయాలి, తొలి ప్రయత్నంలో సఫలుడు కాకపోవచ్చు, మళ్ళీ ప్రయత్నించాలి. తన సాధనను మరింత మెరుగుపరుచుకుని ప్రయత్నిస్తే అప్పుడు అతడు తప్పక లక్ష్యాన్ని చేరుకుంటాడు.
విద్యార్థుల చదువు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చదివితే తప్పక అర్థం అవుతుంది. బట్టీ పట్టడం వలన ఉపయోగం లేదు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదివితే జీవితాంతం గుర్తుండిపోతుంది. చదువు పరమార్థం కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కాదు. అందులోని విషయ సారాన్ని గ్రహించడం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం. ఈ రకమైన అభ్యాసం పాఠశాల స్థాయినుంచే ప్రారంభించాలి.
మనకు తెలిసిన గొప్ప శాస్త్రజ్ఞులందరూ పాఠశాలల్లోనో, విద్యాలయాల్లోనూ నేర్చుకున్న దాని కంటే, వారి కఠిన సాధన ద్వారా నేర్చిన విద్యనే ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధితో, నిత్యసాధన ద్వారా ఏ కార్యం ప్రయత్నించినా అది తప్పక నెరవేరుతుంది.