ఉన్నతమైన ఆశయం, లక్ష్యాలే మనల్ని విజయతీరాలకి చేరుస్తాయి

 వ్యక్తిత్వ వికాస కథలు 

ప్రముఖ విశ్వవిద్యాలయంలో పేరుమోసిన శాస్త్రవేత్తను ఒక జూనియర్ కళాశాల సిబ్బంది తమ కళాశాలలో జరగబోయే వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి వచ్చారు. వారు ఆ శాస్త్రవేత్తను “అయ్యా మీరు మహా జ్ఞానులు, అపర మేధావులు మీ వంటి వారు మా కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసి తమ ప్రసంగం ద్వారా విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెబితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని వేడుకోవడంతో వారి మాటను కాదనలేక ఏ రోజు రావాలో కనుక్కుని ఆ  రోజు వస్తానని చెప్పి వారిని పంపించేశాడు. 

కళాశాల వారు నిర్వహించే వార్షికోత్సవం రోజు రానే వచ్చింది. సాయంత్రం ఏడు గంటలకు ఈ శాస్త్రవేత్త కళాశాలలో తన ప్రసంగం వినిపించాల్సి ఉంది. కానీ ఆయన ఎప్పుడూ ఏదో ఒక పరిశోధనలో తలమునకలై ఉండేవాడు. సరిగ్గా ఆరోజు కూడా అతను పరిశోధనలో భాగంగా ఊపిరి సలపలేనంత పనిలో ఉండి కళాశాల వార్షికోత్సవ విషయాన్ని మరిచిపోయాడు. 

సాయంత్రం ఆరున్నరకి ఆయనకు తాను కళాశాల వార్షికోత్సవానికి వెళ్ళాలని గుర్తుకు వచ్చింది. అంతే ఆదరాబాదరాగా బయల్దేరి తన కార్యాలయం గేటు బయటికి వచ్చిచూస్తే ఒక టాక్సీ కనిపించింది. హడావిడిగా అందులో ఎక్కికూర్చుని డ్రైవర్ తో “బాబు త్వరగా పోనీ” అని చెప్పి, మళ్ళీ తన పరిశోధన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. 

టాక్సీ డ్రైవర్ కి ఏమీ అర్థం కాలేదు. చూస్తే విజ్ఞానవంతుడిలా ఉన్నాడు పైగా పెద్దమనిషి ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు అని అనుకుంటూ ధైర్యం చేసి తక్కువ స్వరంతో “అయ్యా ఎక్కడికి వెళ్ళాలో కాస్త చెప్తారా” అని అడిగాడు. 

సగంలో వదిలి వచ్చిన తన పరిశోధన గురించి ఆలోచిస్తున్న శాస్త్రవేత్తకు డ్రైవర్ మాట సరిగ్గా వినిపించలేదు. కాకపోతే డ్రైవర్ ఏదో అడుగుతున్నాడని మాత్రమే లీలగా అర్థం అవుతోంది. అయినా కూడా ఏమీ పట్టింకుచోకుండా “ఏమీ మాట్లాడకుండా ముందు త్వరగా పోనీ” అని డ్రైవర్తో చెప్పి మళ్ళీ తన పరిశోధన ఆలోచలనల్లో మునిగిపోయాడు. 

డ్రైవర్ కి ఏమీ అర్థం కాలేదు. మళ్లీ ధైర్యం చేసి అడగలేకపోయాడు. బహుశా అతను వెళ్ళాల్సిన ప్రదేశానికి చేరుకుంటే అతనే చెబుతాడులే అనుకుని కారును ముందుకు పోనిచ్చాడు. కానీ ఎంత దూరం పోయినా శాస్త్రవేత్త ఆపమని చెప్పింది లేదు. కారు ఆగింది లేదు. మధ్య మధ్యలో డ్రైవర్ “ఎక్కడికి వెళాలండీ” అని అడగడం, శాస్త్రవేత్త “త్వరగా పోనివ్వు” అని మాత్రం చెప్పడం జరుగుతూనే ఉందే. 

కారు చాలా దూరం ప్రయాణించిన తరువాత శాస్త్రవేత్త తన ఆలోచనలలో నుంచి కాస్త బయటికి వచ్చి డ్రైవర్ తో “బాబూ మనం చేరాల్సిన చోటుకు వచ్చేశామా” అని అడిగాడు. ఆ మాటకు ఖంగుతిన్న డ్రైవర్ కాస్తా "అయ్యా మీరు కారు ఎక్కిన దగ్గర్నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని నేను అడుగుతూనే ఉన్నాను. కానీ మీరేమో అడిగిన ప్రతిసారీ త్వరగా పోనివ్వు అని మాత్రమే చెబుతున్నారు. ఎక్కడి వెళ్ళాలో చెప్పనే లేదు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా చేరాల్సిన చోటుకు వచ్చేశామా అని అడిగితే ఆ ప్రదేశానికి ఎలా వెళ్తాము” అని కాస్త ధైర్యం చేసి అడిగేశాడు. 

అప్పటికి కళాశాల వారు తనకు ఇచ్చిన సమయం మించిపోవడంతో శాస్త్రవేత్త తన తప్పును గ్రహించి తిరిగి తనను తన కార్యాలయం వద్ద దింపమని చెప్పాడు. 

పై కథను బట్టి ఒక లక్ష్యమూ, గమ్యమూ లేకుండా ప్రయాణించడం వ్యర్ధమని తెలుస్తోంది. ముందుగా మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఆ తరువాత దానిని చేరడానికి తగిన ప్రయాణం ప్రారంభించాలి. లేదంటే చేసిన ప్రయాణం మొత్తం వృధాయే అవుతుంది. చాలామంది తాము ఏం చేయాలో నిర్ణయించుకోకుండానే లక్ష్యంవైపు వెళ్తున్నట్లు భ్రమపడుతూ, పరుగులెడుతూంటారు. తీరాచూస్తే తమ లక్ష్యం వైపు కాకుండా ఏదో వైపుకు వెళ్ళిన తరువాత ఇది తమ లక్ష్యం కాదుకదా అని తెలుసుకుంటారు. అప్పటికి సమయం మించి పోయి ఉంటుంది. 

మన ఆశయం ఎంత ఉన్నతమైనదైతే మనం అంతగా కష్టపడతాం. ఉన్నత ఆశయాన్ని చేరడంలో మనంచేసే పరిశ్రమ కారణంగా ఇతర చిన్న చిన్న లక్ష్యాలను కూడా మన చేరుకుంటాం. చిన్న లక్ష్యాలను పూర్తిచేసిన ఉత్సాహం మనల్ని ఆశయసాధన వైపు మరింత బలంగా ముందుకు వెళ్ళడానికి సహకరించి చివరికి మనల్ని విజయులుగా నిలుపుతుంది.

ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని చేరడానికి తగిన మార్గాన్ని ఎంచుకుని లక్ష్యసాధన దిశగా పయనం సాగిస్తే ఏ రంగంలోని వారైనా తప్పక విజయం సాధిస్తారు.


ఇవి కూడా చదవండి 

లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

స్వీయప్రేరణ ద్వారా ఏర్పడే ఉత్తమ వ్యక్తిత్వమే విజయసాధనకు మూలం 

విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి

మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? అందుకు అవసరమైన ధోరణులు

లక్ష్యానికి ప్రాధాన్యతనివ్వడం లక్ష్యసాధనలో భాగమే