లక్ష్య నిర్ణయమే విజయానికి తొలి సోపానం

విజయం సాధించాలంటే ముందుగా ఎందులో విజయం సాధించాలో నిర్ణయించుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నాము, ఏ రంగంలో విజయం పొందాలనుకుంటున్నాము, ఏ కార్యం చేపడితే ఇతరుల కన్నా సమర్ధవంతంగా ఆ కార్యాన్ని పూర్తిచేయగలము, మనకు సరిపోయే వృత్తి ఏది, ఏ పనిలో మన పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించగలము, మన వ్యక్తిత్వానికి తగిన రంగం ఏది, ఏ పని చేస్తే మన మనస్సు సంతోషంగా ఉంటుంది, ఏ పని చేస్తే మనం వికాసాన్ని పొందడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడగలము వంటి కొన్ని ప్రశ్నలను మనకు మనమే వేసుకుని దానికి సమాధానం రాబట్టుకోవాలి. ఆ సమాధానమే మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ఆ లక్ష్య నిర్ణయమే మనం సాధించబోయే విజయానికి తొలిమెట్టు. 

లక్ష్యానికి గల ఒక గొప్ప లక్షణం దాన్ని నిశ్చయించుకుంటే చాలు ఇనుమును అయస్కాంతం ఆకర్షించినట్లు అది మనల్ని తనవైపు లాగేసుకుంటుంది. మనస్సు లక్ష్యంపైన నిలపడమే పురోగమనానికి ప్రారంభం. లక్ష్యమే మనిషికి ప్రాణం, జీవనం. దానినుండే మనిషి ప్రేరణ పొందుతాడు. దృష్టిని కేవలం లక్ష్యం మీదనే నిలపడం ద్వారా నిరంతరం లక్ష్యం వైపు ప్రయాణం సాగుతుంది. అప్పుడే జీవితం ఉత్సాహం, ఉల్లాసాలతో నిండిపోతుంది. దానికారణంగా లక్ష్యప్రాప్తి యొక్క ఆశలో నిరంతరం ప్రసన్నులై ఉండగలుగుతాము. 

మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకునే ముందు అది సమాజ సేవాపూరితమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇరులను దృష్టిలో ఉంచకుని చేసే కర్మ, కేవలం స్వార్ధదృష్టితో చేసే కర్మకన్నా ఎన్నోరెట్లు అధిక ఫలితాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. సేవాభావన అత్యంత విశాలమైనది దానిని మాటల్లో వర్ణించలేము. దానికి అంతం అనేదిలేదు. సేవాభావన ఆదర్శపూరితమైనది. దాని ప్రాప్తి కోసం మన జీవితాలు ఉత్సాహంతో నిండి ఉండాలి. అప్పుడే తృప్తికరమైన మనసుతో లక్ష్యంవైపు మనం వేసే అడుగులు మనకు విజయప్రాప్తిని కలుగజేస్తాయి. 

మనలక్ష్యం ఎంత గొప్పదయితే దానికి అంతే గొప్ప సాధన అవసరం. గొప్ప లక్ష్యంకోసం ఎంత కష్టపడతామో ఆ లక్ష్యాన్ని సాధించినపుడు అంతకు రెట్టింపు ఆనందం లభిస్తుంది. ప్రారంభంలోనే చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం వలన బద్దకం ఆవహించే అవకాశం ఉంటుంది. అదే లక్ష్యం ఎంత గొప్పదయితే ప్రారంభంలోనే అది మనకు అందనంత దూరంలో ఉంటుంది. దానిని చేరడానికి చేసే ప్రయాణంలో చిన్న లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు. ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించే సమయంలో మనం సాధించే చిన్నచిన్న లక్ష్యాలు మనం నిర్ణయించుకున్న మహా లక్ష్యాన్ని పొందటానికి సోపానాలుగా మారుతాయి. లక్ష్యం మనకు ఎంత ఎక్కువ దూరంలో ఉంటే మనం అంత సావధానులుగా దాని సాధన కోసం కృషి చేయగలుగుతాము. 

నేటితరం యువతలో చాలామంది తమకంటూ ఒక నిర్దిష్ట గమ్యంగాని లక్ష్యం గాని లేకుండా ఇతరులను చూసి ప్రలోభపడి ఎక్కువ మంది ఎటువైపు పయనిస్తే గుడ్డిగా అటువైపు వెళుతున్నారు. ఇతరులకు ఇష్టమైన రంగాన్ని తమకు ఇష్టమైన రంగంగా భావించి, చివరికి అందులో రాణించలేక పరాజయులుగా మిగిలిపోతున్నారు. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఏ రంగంలో ఉంటే ఆ రంగమే తమ లక్ష్యమని భావించి తమకు ఇష్టంలేని రంగంలోకి ప్రవేశించి అందులో రాణించలేక తిరిగి బయటికి రాలేక సతమతమవుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా తాము ఏ రంగంలో అయితే రాణించగలుగుతామో అదే రంగంలోకి ప్రవేశిస్తే ప్రారంభంలో తక్కువ స్థాయిలో ఉన్నా కూడా సమయం గడిచిన కొద్దీ, అనుభవం గడించిన కొద్దీ తాము కూడా ఉన్నత స్థానాన్ని చేరుకోగలరు. ఎంచుకున్న రంగం ఏదయినా సరే చేసే పనిని మనస్ఫూర్తిగా ఇష్టపడి చేయగలగాలి.

మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నిష్ణాతులమై ఉండగలగాలి. అలా ఉండాలంటే మొదటగా మనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న రంగంలోని కష్టనష్టాలను ముందుగానే బేరీజు వేసుకోగలగాలి. ఆ తరువాత మన ప్రయాణం ప్రారంభించాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా, విమర్శలు ఎదురయినా కుంగిపోకుండా ముందుకు సాగాలి. ఏ కార్యమైన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. 

రాత్రికి రాత్రే ఎవరూ విజేతలు కాలేరు. విజేతలు కావాలంటే ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడపాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రపంచం విజేతను మాత్రమే చూస్తుంది. దానిని సాధించడానికి పడిన కష్టాలు, శ్రమ ఎవరికీ అవసరం లేదు. అవి గుర్తుంచుకునేది కేవలం విజత మాత్రమే.