విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి

విమర్శలను ఎదుర్కోవడం ఒక కళ. సాధన ద్వారా దీనిని అందరూ సాధించవచ్చు. సాధారణంగా అభినందనలను స్వీకరించినంత ఆనందంగా విమర్శలను స్వీకరించలేము. ఎవరైనా విమర్శలు చేస్తే వారిపట్ల సదభిప్రాయం కలగదు. ఎదుటివారు మనపట్ల చేసే విమర్శ సద్విమర్శ అయితే అది మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. దానిని మనం సానుకూలంగా తీసుకోగలిగితే అది ఖచ్చితంగా మన అభ్యున్నతికి దారితీస్తుంది. లేదంటే ఇతరులతో మనకు విభేదాలు కలుగుతాయి. 

సాధారణంగా మనలోని లోటు పాట్లను ఎవరైనా ఎత్తిచూపితే మన సహనం దెబ్బతిని మనలో సంతోషం మాయమవుతుంది. ఇంకా చెప్పాలంటే మనం కూడా వారిని విమర్శించే పరిస్థితి కలుగుతుంది. మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం తీవ్రంగా స్పందిస్తాము. మనలోని లోటు పాట్లు గురించి మనకు తెలిసినా కూడా వాటిని కప్పిపుచ్చుకుంటూ ప్రవర్తించడం మనం అలవరచుకున్నాము. ఆ లోటు పాట్లకు కారణాలు, వివరణలు చెప్పుకుంటూ మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాము. అందుకే  ఇతరులు మనల్ని విమర్శిస్తే  దానిని ఆమోదించేందుకు  ససేమిరా ఇష్టపడం. ఇది మానవ సహజ నైజం. అవసరమైతే వారిని మన జీవితం నుంచి దూరంగా ఉంచడానికైనా మనం సిద్ధమవుతాం. 

ఈ విధంగా విమర్శలకు స్పందించడం, విమర్శించిన వ్యక్తులను దూరంగా ఉంచడం వలన కొన్ని విషయాల్లో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడేవారికి దూరం కావడం వల్ల మనకు మనం సహాయం చేసుకోలేము. ఇటువంటి లక్షణం మనలో నిరంతరం కొనసాగుతూ ఉంటె మనకు ఆప్తులైన వారిని ఏంతో మందిని మనం కోల్పోవాల్సి వస్తుంది. మనలోటు పాట్లను ఎత్తిచూపేవారిని భరించలేకపోవడం వలన వాటిని మనం  ఎప్పటికి సరిదిద్దుకోలేము. విమర్శించిన వారితో సంబంధ బాంధవ్యాలు తెంచుకోవడం మన స్వభావం అని గ్రహించిన ఇతరులు మనలో గల లోటుపాట్ల గురించి మన వద్ద ప్రస్తావించడమే మానేస్తారు. ఇది మనల్ని ఇంకా చాల పెద్ద సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఎప్పుడూ మనల్ని పొగుడుతూ, అభినందిస్తూ మన వెంట ఉండే వారు ఎప్పటికి మనకి మంచి స్నేహితులు కాలేరు. కేవలం మన నుండి లబ్దిపొందేవారిగా మాత్రమే మిగిలిపోతారు.

మన నిజమైన స్నేహితులు ఎవరు?

మన నిజమైన స్నేహితులు మనలోని లోపాలను మనకు తెలియచేయడమే కాకుండా వాటిని అధిగమించడానికి తమవంతు కృషి కూడా చేస్తారు. మనలోని బలాలు, బలహీనతలు తెలిసిన వారు అవడం వల్ల మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురయినప్పుడు ప్రత్యామ్నాయ విధానాలు సూచించి మనల్ని సరైన దారిలో నడిపిస్తారు. పొగడ్తలు, అభినందనలు మనిషి ప్రతిభకు ఆటంకం కలుగచేస్తాయి. సద్విమర్శలు మనలో పనిచేసే నైపుణ్యాన్ని వెలికితీస్తాయి. మనం ఎవరినైనా విమర్శిస్తే అది  వారికీ ఒక దివ్యమైన ఔషధంలా పని  చేయాలి గానీ వారి మనసుకు  గాయం చేసేదిలా ఉండకూడదు.  'తప్పు' సరిదిద్దుకుంటే మనిషి ఎటువంటి లాభం పొందగల్గుతాడో విమర్శ చేసే వ్యక్తి ఎదుటి వ్యక్తికీ వివరించి చెప్పగల్గాలి.  

సాధారణంగా ఎదుటి వారిని విమర్శించడానికి ప్రతి మనిషి సర్వదా సిద్ధంగా ఉంటాడు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎదుటి వారు మనల్ని అభిప్రాయం చెప్పమని ఆహ్వానించినప్పుడు మాత్రమే సద్విమర్శ చేయాలి. కానీ సన్నిహిత మిత్రులు, సమీప బంధువుల విషయంలో వారి ఆహ్వానం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం వారి మేలు కోరుతాము కాబట్టి వారికి మేలు చేయగల వివర్శలు చేయవచ్చు. అయితే ఎవరైనా సరే మన సద్విమర్సలను సానుకూలతతో సాదరంగా ఆహ్వానించగలిగినప్పుడే ఇది రామబాణం లాగా పనిచేస్తుంది.  సరియైన సమయం చూసుకుని స్నేహితుడిని పక్కకు తీసుకువెళ్ళి ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే విమర్శించాలి. అయితే చాలామంది తాము పరిశీలించిన విషయాలను చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే అది విమర్శగా తీసుకుని కావలసిన వారు తమ స్నేహాన్ని నిరాకరిస్తారనే సంకోచంతో ఉంటారు. 

నిజాలు నిష్ఠూరాన్ని కలుగజేస్తాయని, తమ స్నేహాలు పాడవకుండా ఉండడానికి నిశ్శబ్దం ఉత్తమమైన మార్గమని ఆలోచించే వారు చాలామంది ఉంటారు. మరొక రకంగా ఆలోచించే వారుకూడా ఉంటారు. తప్పులు చేసినప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగల్గుతారనేది వీరి ధోరణి. పైగా తమ సలహాలు, విమర్శలు ఎదుటివానికి ఏ రకంగాను ఉపయోగపడవని వారు వాటిని పెడ చెవిని పెడతారని వారి నమ్మకం. అందుకే తమ మధ్య ఉండే స్నేహబంధాలను తెంపుకునెంత సాహసం వీరు చేయరు. 

నిజానికి విమర్శ చేయాల్సిన విధంగా చేయగల్గితే స్నేహితునికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మన మీద పూర్తి విశ్వసం ఉంచగలిగిన స్నేహితునికి లేదా ఆప్తులకు మన విమర్శ వలన  కోపంరాదు. మన విమర్శ తమకు ఎంతో మేలు చేకూర్చిందని కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఎటువంటి పరిస్థితి లోను విమర్శ వేళాకోళంగా చేయకూడదు. మనం నవ్వుతూ చేసే విమర్శలు ఎదుటి వారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.  

విమర్శలు ఎదుర్కోవడం ఎలా?

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో విమర్శలకు గురవుతూనే ఉంటారు. విమర్శ ప్రతి ఒక్కరూ చేయగలరు. చేస్తూ ఉంటారు కూడా. విమర్శ అనేది ఎదుటి వారిని గాయపరచేదిగా ఉండకూడదు. సహాయం చేసే ధోరణి ఉన్నవారికే విమర్శించే హక్కు ఉంటుంది. విమర్శవల్ల, విమర్శ చేసేవారు తాము  ఆనందం పొందనంత సేపు విమర్శించవచ్చు.  ఎప్పుడైతే ఎదుటి వారిని  విమర్శిస్తున్నప్పుడు మనం ఆనందం పొందుతున్నట్లు భావిస్తుంటామో అదే క్షణం  విమర్శ ఆపివేయాలి. 

విమర్శ ఇతరులకు ప్రేరణగా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తికి ఆందోళన కలిగించకూడదు. కోపగించుకుని మాటలు విసిరితే ఆ తరువాత బాధపడాల్సి వస్తుంది. పైగా పరిస్థితులు మరింత దిగజారుతాయి. విమర్శలో యదార్థం ఉందేమో ఆలోచించాలి. ప్రతి ఒక్కరిలోను లోపాలు ఉంటాయి. దీనికి ఎవరూ మినహియింపు కాదు. తాను పరిపూర్ణుడనుకునేవ్యక్తిని ఎవరూ ఆమోదించరు. పిరికివాళ్ళు తమ తప్పులు తాము ఒప్పుకోరు. విశాల హృదయులు తమ తప్పును తాము అంగీకరిస్తారు. ఈ విషయం గుర్తుంచుకుంటే విమర్శను సమదృష్టితో స్వీకరించడం కుదురుతుంది. మనల్ని విమర్శించే వ్యక్తిని ఎప్పుడైతే మనం మార్గదర్శకుడిగా భావిస్తామో అప్పుడే అతడి పట్ల మనకు సానుకూల ధోరణి కలుగుతుంది.  మనలోని లోపాలు అధిగమించేందుకు సహకరిస్తున్న వ్యక్తి అని అనుకుంటే విమర్శ మనల్ని బాధించదు. ఏ సమయంలో ఎటువంటి ధోరణిలో వున్నప్పుడు విమర్శించారనేది విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ లేకుండా విమర్శను విమర్శగా భావించకూడదు. 

నిరంతరం ఇతరులను విమర్శించడమే తమ ధ్యేయంగా ఉండే వారి విమర్శలకు విలువ ఇవ్వనవసరం లేదు. ఎవరైనా విమర్శిస్తూ ఉంటే మౌనంగా హుందాతనాన్ని వీడకుండా వినాలి. సహనానికి  మించిన గొప్పదనం మరొకటి లేదు. చిరాకు పడుతూ, చిటపటలాడుతూ సమాధానం చెప్పడం వంటి పనులు చేయరాదు. విమర్శ అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక భాగం. దానిని కోపగించుకోకుండా, గాయపడకుండా స్వీకరించడం అలవరచుకోవాలి. ప్రతిఘటన వలన మిగిలేది మనో వేదన మాత్రమే అని గుర్తించాలి.


#How to face Criticism 

#Uses of criticism 

# Problems of Criticism

# Friends and criticism 

ఇవి కూడా చదవండి 

లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

స్వీయప్రేరణ ద్వారా ఏర్పడే ఉత్తమ వ్యక్తిత్వమే విజయసాధనకు మూలం

మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? అందుకు అవసరమైన ధోరణులు