లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధన కోసం కృషిచేసే సమయంలో అత్యంత ఆవశ్యకమైన అంశం ప్రేరణ. లక్ష్య సాధన ద్వారానే ప్రేరణ కలుగుతుంది. లక్ష్యానికి గురి పెట్టకుండా సంధించిన బాణం ఏ విధంగా వృధా అవుతుందో అదే విధంగా లక్ష్య రహితంగా మీరు చేస్తున్న పరిశ్రమ చివరికి మిమ్మల్ని నిరుత్సాహంలోకి నెట్టుతుంది. ప్రేరణ అనేది ఎక్కడి నుంచో రాదు మనం నిర్వర్తించే కార్యాలు, మన జీవన విధానంలోనే అది ఇమిడి ఉంటుంది. కాకపోతే దానిని గుర్తించడమే మనం చేయాల్సిన పని.

కార్యసాధన దిశగా పయనం సాగిస్తున్నప్పుడు అందుకు సహకరించకుండా మీ ప్రేరణను తగ్గిస్తున్నట్లుగా భావించే వస్తువులను గానీ, అలవాట్లను, విషయాలను చివరికి వ్యక్తులను కూడా మీ దరిచేరనీయకండి లేదా మీరే వాటికి దూరంగా ఉండడం మంచిది. లక్ష్యసాధన దిశలో సాగుతున్నంత కాలం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మీ అభివృద్ధి గురించిన ధ్యాసలో మాత్రమే ఉంటే ఆ ధ్యాసే మీకు ఉత్తమ ప్రేరణను కలిగించి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీపై మీకున్న విశ్వాసం, మీరు సాధించిన విజయాల కారణంగా మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం మీకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయి. మీలో ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఎటువంటి విషయాన్నైనా అన్ని రకాల కోణాలనుండి శ్రద్ధగా పరికించి నిర్ణయించే అలవాటును పెంచుకోవడం సాధ్యమవుతుంది.

ఏ కార్యంలోనైనా పరిపూర్ణ విజయం సాధించాలంటే దానికి తగిన జిజ్ఞాస కలిగి ఉండడం అంత్యంత ఆవశ్యకం. జిజ్ఞాస రహిత కార్యంలో ఎంత కష్టం వెచ్చించినా ఫలితం శూన్యం. కార్యం పట్ల మీరు కలిగి ఉన్న జిజ్ఞాస కారణంగా మీలో ఉత్సాహం కలిగి చివరికి ఆ ఉత్సాహమే మీకు ప్రేరణగా నిలుస్తుంది. మీ నమ్మకాలు విశ్వాసాలతో పాటు చక్కటి కుటుంబవాతావరణం మీకు ప్రేరణను కలిగిస్తుంది. మీరు నిర్దేశించుకునన్న లక్ష్య సాధనకు గాను అవసరమైన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా కూడా మీరు ప్రేరణ పొందవచ్చు. అనవసరమైన విషయాలను మనసులోకి రానీయకుండా ఒక వేళ వచ్చినా వాటిని అక్కడికక్కడే వదిలేయడం ద్వారా, అదే విధంగా మీవద్ద గలదానిని ఇతరులతో పంచుకోవడం ద్వారా మంచిని పెంచుతూ అవసరమైన సమయంలో క్షమాగుణాన్ని అవలంబించడం ద్వారా కూడా మీ స్వీయప్రేరణను పెంచుకోవచ్చు.

మీరు జీవించే మరియు అనుభవించే జీవితం మీకు మీరే స్పూర్తిని, ప్రేరణను కలుగజేసేలాగా ఉండాలి. అన్నిటి కంటే ముఖ్యమైన అంశం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మీ గురించి మీరు ఎంతగా తెలుసుకొని విశ్లేషణ ఆత్మశోధన చేస్తారో అదే మీ ఉజ్వల భవిష్యత్తుకు మీ పెట్టుబడి మరియు బలమైన పునాది. మీ కలలు నెరవేర్చుకోవడానికి నిజాయితీ, కష్టపడి పనిచేసేమనస్తత్వం చాలా ముఖ్యం కాలక్రమేణా అటువంటి తత్వాన్ని మీరు అలవరచుకోవాల్సి ఉంటుంది. ఇతరులకి చేతనైనంత సహాయం చేయడం ద్వారా మీలో ప్రతికూల భావనలు పోయి సానుకూల దృక్పధం అలవడే అవకాశం ఉంటుంది.


మీరు చేసే ప్రతి పనిని న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా అత్యంత శ్రద్ధతో చేయడానికి ప్రతయ్నం చేయండి మీరు చూపే శ్రద్ధయే మీలో స్వీయ ప్రేరణను కలుగజేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయం సాధించేవరకు విశ్రమించకండి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రారంభించిన కార్యాన్ని ఆపకండి ఒక ప్రయత్నం సఫలంకానపుడు నిరుత్సాహం పడకుండా, ప్రేరణను నీరుగారకుండా, పట్టుదలతో మరోమారు ప్రయత్నం చేసి చూడండి విజయం తప్పక మీదే అవుతుంది.

చైతన్యవంతమైన జీవితం మీ ప్రేరణను పదికాలాల పాటు నిలిచేలా చేస్తుంది. నిరంతర సాధన, నిరంతర అభివృద్దులే మీకు నిజమైన ప్రేరణనిస్తాయి. అదే విధంగా ప్రతి అంశంలోనూ నాణ్యత పై దృష్టి, ఉన్నత స్థాయికై కృషిచేయడం వంటి అంశాలు కూడా ప్రేరణను కలుగజేస్తాయి. నిర్మాణాత్మకమైన విమర్శ, నిజమైన అన్వేషణా దృష్టితో అడిగిన ప్రశ్నలు ప్రేరణనిస్తాయి. మీరు చేసే నిరంతర అధ్యయనం, ఆ అధ్యయనంలోని అంశాలను మీకు అన్వయించుకోవడం, సమీక్షించుకోవడం వలన మీలో ఒక నూతనోత్తేజం కలుగుతుంది. మీ ఆలోచనలలో, మాటలలో, చేతలలో తొణికిసలాడే ఉత్సాహం మీ వ్యక్తిత్వ కిరణాలను, నలుదిక్కులా ప్రసరింప జేసినప్పుడు ఆ ప్రతిస్పందనలు మీకు ప్రేరణను కలుగజేస్తాయి. ఒకవేళ మీరు వాయిదావేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటే దానిని నిర్మోహమాటంగా వదిలించుకోండి. విజయాన్ని సాధించి పెట్టే వైఖరులను ఆహ్వానించండి. వాయిదావేయకపోవడం వలన మీలో మీరు నిర్వర్తించే కార్యం పట్ల పట్టుదల పెరుగుతుంది. మీలో పెరిగిన ఈ పట్టుదలే మీకు విజయాన్ని సాధించి పెడుతుంది. ఈ విధంగా సాధించిన విజయం మీకు మరింత ప్రేరణనిస్తుంది.మీ భవిష్యత్తు మరెవరి చేతుల్లోనో చేతల్లోనో లేదు మీ చేతుల్లో, చేతల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించండి. మంచి భవిష్యత్తును సాధించటం ఎవ్వరికైనా సాధ్యమే. మంచి భవిష్యత్తుకు మంచి ప్రేరణలే పునాదులుగా నిలుస్తాయి.


మనల్ని మనం అర్థం చేసకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరు కాబట్టి ముందు మిమ్మల్ని మీరు బాగా అర్థంచేసుకోండి. దానివలన మీకు ఇతరులు ఇకా బాగా అర్థం అవుతారు. అర్థవంతమైన మానవసంబంధాల ద్వారానే చక్కని ప్రేరణలు లభిస్తాయి. మీరు నమ్ముకున్న విలువలను ఎప్పటికీ వదిలిపెట్టకండి. వాటిని ప్రతిసారీ గుర్తు చేసుకుని మీ విలువలకు మీరే విలువ ఇవ్వండి. భవిష్యత్ దర్శనం చేయండి. అది మీ కలల సాకారానికి కావలసిన ప్రేరణనిస్తుంది. కృషి సంపదను సృష్టిస్తుంది, అద్భుతాలని ఆవిష్కరిస్తుంది.

కృషి లేకుండా విచారపడుతూ వూరకుండిపోతే ఉన్న సంపద తరిగిపోతుంది. అవకాశాలు కనుమరుగవుతాయి. అదృష్టాలు అదృశ్యమవుతాయి. అందుకే మీ కృషియే సరియైన ప్రేరణ అని గమనించండి. సత్ఫలితాలనిచ్చే మీ కృషిని మరింత ముమ్మరం చేయండి. ముమ్మరమైన కృషి ప్రేరణనిస్తుంది. ప్రపంచంలోని ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అదే విధంగా మీకో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నది. దాన్ని పెంపొందించుకోవాలనే ప్రేరణ పొందండి. మీరు అభివృద్ధి చెందగలరనే సత్యాన్ని నమ్మండి మరియు నిరూపించండి. మీరు, మిమ్మల్ని నమ్మినవాళ్ళు మిమ్మల్ని కన్నవాళ్ళు మీ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకూడదనే మీ విశ్వాసమే మీకు ప్రేరణ కలిగిస్తుంది. నిరంతర నిత్యనూతన ఉత్సాహంతో జరుపబడే కృషి ప్రేరణనిస్తుంది. దృఢ సంకల్పంతో మీ లక్ష్యంవైపు తొలి అడుగు వేయడం మొదలు పెట్టండి. పట్టుదల, పరిశ్రమ, ప్రగతి వీటి ద్వారానే మీరు నిజమైన ప్రేరణని పొందగలుగుతారు.



# The role of motivation in goal attainment

# Motivational management

# Importance of Self Motivation

ఇవి కూడా చదవండి