తరచూ లక్ష్యాన్ని మార్చడం వలన చివరికి ఏ లక్ష్యము సిద్ధించదు

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తరువాత అది పూర్తిచేయలేమనే భయంవల్లనో లేదా ఇతరులను చూసో లక్ష్యాన్ని మార్చుకోవడం సరికాదు. ఎటువంటి భయాలకు, ప్రలోభాలకు లోనవకుండా ముందుకు సాగినవారే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి గమ్యాన్ని మార్చడం వల్ల అనుకున్న గమ్యమే కాదు అసలు ఏ గమ్యమూ చేరకుండా జీవితమంతా గడచిపోయి చివరికి ఎటువంటి లక్ష్యము పూర్తిచేయకుండానే జీవితం ముగిసిపోతుంది. లక్ష్యం కోసం ఎటువంటి ప్రలోభాలు కలిగినా వాటికి లోనవకుండా అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసే స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండేలాగా ప్రయత్నించాలి. ఇందుకు ఒక వాస్తవ సంఘటనను పరిశీలిద్దాం. 

నృత్య, సంగీతా కళలలో అసమాన ప్రతిభా సామర్థ్యాలు కలిగి, తన జీవితమంతా కళకే అంకితం చేసిన గొప్ప కళాకారిణిగా శ్రీమతి రుక్మిణీదేవి అరుండెల్ ప్రఖ్యాతిగాంచారు. నృత్య, సంగీతాలలో ప్రతిభావంతులను భావితరాలకు అందించడమే ధ్యేయంగా తిరువన్ మియాలో దాదాపు వంద ఎకరాల స్థలంలో 'కళాక్షేత్రం' అనే ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దింది. 

1977లో, అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తన పదవీ కాలం పూర్తికాకముందే కన్నుమూశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా పదవిలో ఉన్న మొరార్జీ దేశాయ్, రుక్మిణీ దేవిని భారత రాష్ట్రపతి పదవిని చేపట్టాల్సిందిగా కోరారు. సాధారణ వ్యక్తులెవరైనా దేశ అత్యున్నత పదవి తమను వరిస్తుంటే ఏదీ ఆలోచించకుండా సరే అనేస్తారు. కానీ ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రం తాము ఒక లక్ష్య సాధనలో ఉన్నాము కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరడమా, లేదా ఇటువంటి ప్రలోభాలకు లోనవడమా అని ఆలోచిస్తారు. సరిగ్గా రుక్మిణీదేవి ఇదే విధంగా ఆలోచించారు. తన జీవిత గమ్యం కళ, దానికోసమే తానూ పాటుపడదామని ఎప్పుడో నిర్ణయుంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను తన లక్ష్యాన్ని మార్చుకోకూడదని నిశ్చయించుకుని, మరుసటి రోజు తాను రాష్ట్రపతి పదవికి తాను అర్హురాలిని కాదని, తన జీవితం కళకు మాత్రమే అంకితమని సున్నితంగా మొరార్జీదేశాయ్ కి వివరించారు. ఆయన ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆమె నిర్ణయంలో ఎటువంటి మార్పులేదు. ఈ విషయాన్ని అప్పట్లో దేశ విదేశాలలోని అనేక పత్రికలు కళపై ఆవిడకు గల మక్కువ గురించి, అంత గొప్ప పదవిని కాదనగలిగిన ఆవిడ వ్యక్తిత్వాన్నీ కొనియాడుతూ వ్రాశాయి. ఆ తరువాత ఆవిడ కళకే పూర్తిగా అంకితమైనారు. కేవలం ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారే ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికోసం పాటుపడుతూ, మధ్యలో ఏదో అవకాశం వచ్చిందని తమ లక్ష్యాన్ని మార్చుకుని, తీరా అందుకు తాము సరిపోమని గ్రహించేలోపు అనవసర కాలయాపన జరుగుతుంది. ఒక లక్ష్యమంటూ ఏర్పరచుకున్న తరువాత, దృఢచిత్తంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లోనవకుండా తమ గమ్యాన్ని చేరడం ఉత్తమ వ్యక్తిత్వం గలవారి లక్షణం. ఇటువంటి వారు తమ జీవితంలో ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా ఖచ్చితంగా దానిని చేరగలరు.