స్వీయప్రేరణ ద్వారా ఏర్పడే ఉత్తమ వ్యక్తిత్వమే విజయసాధనకు మూలం

విజయం సాధించడంలో అత్యంత కీలకమైన అంశం ఉత్తమ వ్యక్తిత్వం. వ్యక్తిత్వానికి మన ప్రవర్తనే గీటురాయిగా నిలుస్తుంది. మన ప్రవర్తన మన ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది. మనలోని దృక్పథం కూడా మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఎదుటివారికి మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది అనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తించాలి. విజయ సాధనకు మన నడవడికను పునాదిగా చెప్పవచ్చు. అదే విధంగా ప్రేరణను విజయానికి తొలి సోపానంగా చెప్పవచ్చు. మనలోని ప్రేరణ ఎల్లపుడూ మండుతున్న కొలిమిలాగా రగులుతూ ఉండడం వలన మనలోని తపన, తృష్ణ, ఉన్నతికి వెళ్లాలనే కాంక్షలు కలుగుతాయి.

ఎవరిలోనూ ప్రేరణ తనంతట తానుగా కలగదు. లక్ష్య సాధన కోసం నిరంతర వ్యూహ రచన చేసేవారిలో నిత్య ప్రేరణ కలుగుతూనే ఉంటుంది. ప్రేరణ కారణంగా మనిషిలో సామర్థ్యం జీవం పోసుకుని తద్వారా జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మనిషిలో 'కోరిక' మొదలు కావడం అనుకూల ప్రేరణ. భయం ఆవరించడం ప్రతికూల ప్రేరణ. లక్ష్యసాధన కోసం దృష్టి లక్ష్యం మీద నిలిపితే సాధన వైపు మనసు మళ్లుతుంది. కృషి, పట్టుదల, ఏకాగ్రత వంటి లక్షణాలు సాధనను మరింత బలోపేతం చేస్తాయి. మనిషి ఆశాజనకంగా ఉంటూ ఉత్సాహంగా తన కార్యాన్ని నిర్వర్తించగలుగుతాడు.

'ఉన్నత స్థానం' సాధించాలను కోవడం 'లక్ష్యాన్ని చేరుకోవడం, 'అనుకున్న విజయం' పొందాలను కోవడం వంటి కోరికలు మనిషిలో అంతర్గతంగా దాగివున్న శక్తుల్ని వెలికి తీస్తాయి. భయం మనిషిలో నిరాశావాదాన్ని తెచ్చిపెడుతుంది. నిరాశావాదంతో ఉన్న వారు దిగులుగా, ఏదో పోగొట్టుకున్న వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువగా ఆత్మన్యూనతా భావం కనిపిస్తుంది.


సాధారణంగా స్వీయ ప్రేరణ పొందిన వారు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడమేగాక ఇతరుల లక్ష్యాలకు ప్రేరణను కలిగించగలుగుతారు. మనల్ని లక్ష్యసాధన దిశగా నడిపించగల గల సమర్ధత మన మనసుకు ఉంటుంది. సాధనతో దానిని సక్రమంగా ఉపయోగించుకుంటే మనలో నిద్రాణ స్థితిలో వున్న ప్రతిభలను వెలికితీయవచ్చు. మనలోని అవగాహన, ఊహాశక్తి, న్యాయనిర్ణయశక్తి, దృఢచిత్తం వంటి లక్షణాలను మన దృక్పథం బలోపేతం చేస్తుంది. ప్రేరణకు ఇవన్నీ ఇంధనాలుగా ఉపయోగపడుతాయి.

ప్రేరణ ఒకొక్కసారి చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కూడా కలుగుతూ ఉంటుంది. మనసులో ఏదోమూల దాగివున్న ప్రేరణను వెతికి బయటికి తీసేకొలది వస్తూనే ఉంటుంది. స్వచ్ఛందంగా పనిచేసేవారు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. అదే బలవంతంగా పనిచేసేవారికి ప్రతి విషయం ఒత్తిడిగానే అనిపిస్తుంది. అందుకే పనిపట్ల సానుకూల ప్రభావం ఏర్పరచుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. స్వీయ ప్రేరణతో పనిచేసేవారికి ఎప్పటికీ ఒత్తిడి ఉండదు. పైపెచ్చు వీరు తమ దృష్టి ఎప్పుడూ నిర్వర్తించాల్సిన కార్యం మీద ఉంచి రాత్రింబవళ్లూ లక్ష్యసాధన కోసం కృషి చేస్తూనే ఉంటారు. 


మార్పును మనసు అంగీకరించేలా చేసేది స్వీయప్రేరణే. మన చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ మనల్ని చులకన చేసి చూపుతూ ఉంటుంది. ఫలితంగా మనుషుల్లో ప్రతికూల ఆత్మ ప్రతిబింబం ఏర్పడి, ఆత్మన్యూనత భావాలు కలుగుతాయి. స్వల్ప విజయం సాధించగానే శిఖరాన్ని అధిరోహించిన ఆనందంతో మన మనసు విశ్రాంతి తీసుకునేందుకు ఇష్టపడుతుంది. మరో నూతన ప్రణాళికను చేపట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉండదు. అందుకే చాలా మంది వ్యక్తులు మార్పును స్వాగతించడానికి ఇష్టపడరు. కానీ స్వీయప్రేరణ ద్వారా ఇటువంటి స్థితిని అధిగమించవచ్చు. స్వీయప్రేరణ పొందిన వ్యక్తులు ఇటువంటి అడ్డంకులను సునాయాసంగా దాటగలుగుతారు. స్వీయప్రేరణ పొందిన సాధారణ ప్రతిభావంతులు కూడా అసాధారణ ప్రతిభావంతులుగా కనిపిస్తారు. వీరు సృజనాత్మకంగా ఆలోచిస్తూ తగిన పురోగతి సాధిస్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి 

లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి

మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? అందుకు అవసరమైన ధోరణులు