మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? అందుకు అవసరమైన ధోరణులు

మనం నిర్దేశించుకునే లక్ష్యాలు మనల్ని పై స్థాయికి చేర్చగలిగేవిగా ఉండాలే తప్ప మనల్ని మరింత అధఃపాతాళానికి దిగజార్చేవిగా ఉండకూడదు. యదార్థతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే ఏర్పరచుకోవాలి. మన లక్ష్యాల్ని మనం సాధించగలిగేలాగా మన సామర్థ్యానికి తగినవిగా ఉన్న వాటినే నిర్దేశించుకోవలి. ఇతరులను చూసి మన లక్ష్యాన్ని ఎప్పుడూ నిర్ణయించుకోరాదు. మన లక్ష్య సాధనలో భాగంగా ఇతరుల ద్వారా ప్రేరణ అవడం తప్పుకాదు కాని మన సామర్థ్యానికి మించిన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ద్వారా మనం వారిలాగా లక్ష్యాన్ని సాధించలేకపోతే ఆత్మన్యూనతకు లోనవ్వాల్సి వస్తుంది.  నిర్దేశిత లక్ష్యం ఎంత కష్టంగా ఉంటే మనలోని నైపుణ్యాలు అంత ఎక్కువగా బయటికి వస్తాయి.  


తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ ధోరణిని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమ లక్ష్యసాధనకు ప్రతికూల వాతావరణాన్ని కల్పించే పరిస్థితులకు, ఆలోచనలకు అదేవిధంగా మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు నటిస్తూ మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే వారు మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు అటువంటి వారిని మన దరికి చేరనీయకపోవడమే మంచిది. ఎవరైతే మన లక్ష్యసాధనకు విలువనిస్తూ తరచూ మన లక్ష్యాన్ని గుర్తుచేసి మనల్ని జాగృతం చేస్తారో అటువంటి శ్రేయోభిలాషులతో మన లక్ష్యాల గురించి నిర్భయంగా చెప్పవచ్చు. దాని వలన మన లక్ష్యాన్ని మనం మరిచిపోయినా మన శ్రేయోభిలుషులు నిరంతరం మనకు గుర్తుచేస్తుంటారు. 

మనం ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటే ముందు దానిని మన కోరికల సూచీలో మొదటగా ఉంచాలి. ఉన్నతి కోరుకోవడం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలుగుతాము ఈ కోరిక మనలో అంతర్గతంగా ఒక బలమైన పునాదిని వేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన లక్ష్యసాధనకు అవసరమైన ఉత్సాహం, ప్రోత్సాహం, పట్టుదల ఈ బలం ద్వారానే సమకూరుతుంది. మనలో ఆరోగ్యకరమైన కోరికలు కలిగినపుడు అవి నిస్వార్ధంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కోరికలలో దర్పం, గర్వం వంటివి అంశాలు కనిపించవు. తమపై అపారమైన నమ్మకం గలవారు మాత్రమే ఆరోగ్యకరమైన కోరికలు కోరుకుంటారు. ఇటువంటి వారు తమ లక్ష్యాలకేగాక ఇతరుల లక్ష్యాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. వీరు ఎటువంటి రంగాలలో ప్రవేశించినా తమదైన శైలిలో ఆవిష్కరణలు చేస్తూ, సృజనాత్మకమైన పనులు చేయగలుగుతూ ఉంటారు. కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మనం వెచ్చించే ప్రతి సెకను కాలం విలువైనదని గుర్తించి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారే చివరికి విజేతలుగా నిలుస్తారు.

ఇవి కూడా చదవండి 

లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

స్వీయప్రేరణ ద్వారా ఏర్పడే ఉత్తమ వ్యక్తిత్వమే విజయసాధనకు మూలం 

విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి

ఉన్నతమైన ఆశయం, లక్ష్యాలే మనల్ని విజయతీరాలకి చేరుస్తాయి

లక్ష్యానికి ప్రాధాన్యతనివ్వడం లక్ష్యసాధనలో భాగమే