లక్ష్యానికి ప్రాధాన్యతనివ్వడం లక్ష్యసాధనలో భాగమే

సాధారణంగా విజయానికి సంబంధించి గొప్ప లక్ష్యాలు ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. కానీ వారిలో అందరూ లక్ష్యాల సాధనకు అవసరమైన కృషి మరియు చొరవ చూపడంలో వెనుకంజలో ఉంటారు. ఇందుకు ప్రధానకారణం వారిలో వుండే మానవ సంబంధాల బలహీనత. మన చుట్టూ ఉండే మానవ సంబంధాలతో మనం మానసికంగా అల్లుకుపోయి ఉంటాము. ఈ సందర్భంలో ఏర్పడే బలహీనతే ఒక్కొక్కసారి మనం లక్ష్యం వైపు పయనం సాగడంలో అడ్డంకిగా మారుతుంది. దీని అర్థం లక్ష్యాలకోసం బంధాలు, బంధుత్వాలు, మిత్రులు, శ్రేయోభిలాషులను వదులుకోవాలని కాదు. కానీ మన వ్యక్తిగత బాంధవ్యాలు మన లక్ష్యాలకు ఆటంకాలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ మన లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. మన జీవితంలో లక్ష్యాలు ఎంత ముఖ్యమో మానవ సంబంధాలూ అంతే ముఖ్యం. 

మనం మనల్ని నమ్మిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాని మరీ మోతాదుకు మించి, వ్యక్తిగత జీవితంలో ఉండే సన్నిహితులతో ఏమైనా పొరపాచ్చాలు రావచ్చేమో అని భయపడి మనం చేరాల్సిన లక్ష్యాల పట్ల రాజీపడటం మాత్రం తగదు. మానవ సంబంధాల ప్రయోజనాల కోసం మన లక్ష్యాలను ఫణంగా పెట్టడం సరైనది కాదు. దాని వలన జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాన్ని మనమే చేజార్చుకున్నట్లు అవుతుంది. దానికి కారణంగా మన శ్రేయోభిలాషులను నిందిచే పరిస్థితి కలుగుతుంది. 

మరో రకంగా ఆలోచిస్తే ఈ రకమైన మన రాజీ ధోరణి వలన మన శ్రేయోభిలాషులకు మనం మన పరాజయాన్ని కానుకగా ఇస్తున్నామన్న మాట. మన మీద ఎంతో నమ్మకంతో ఉండి మనం ఏదో సాధిస్తామని నమ్మిన మనవారికి మన పరాజయాన్ని బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సబబు. అలా కాకుండా మన స్వీయ నిర్ణయాలకు కట్టుబడి, అకుంఠిత దీక్షతో విజయం సాధిస్తే మన విజయానికి మనతో బాటు మన శ్రేయోభిలాషులు కూడా సంతోషిస్తారు. అది వారి విజయం కూడా. ఇటువంటి సమయంలోనే మనం శ్రేయోభిలాషుల కోసం రాజీపడి లక్ష్యాన్ని దూరం చేసుకోవడమా, లేదా దూరదృష్టితో ఆలోచించి మన శ్రేయోభిలాషులను మన విజయంలో భాగస్వాములను చేయడమా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన సరైన నిర్ణయ సామర్ధ్యమే మనల్ని లక్ష్య సాధన దిశగా ప్రయాణించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి 

లక్ష్య సాధనలో ప్రేరణ పాత్ర

స్వీయప్రేరణ ద్వారా ఏర్పడే ఉత్తమ వ్యక్తిత్వమే విజయసాధనకు మూలం 

విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి

మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? అందుకు అవసరమైన ధోరణులు

ఉన్నతమైన ఆశయం, లక్ష్యాలే మనల్ని విజయతీరాలకి చేరుస్తాయి