ఇతరులతో పోల్చుకునే గుణమే వ్యక్తిగత ప్రతిభ వినాశనానికి దారితీస్తుంది

సాధారణంగా అనేకమంది తమను ప్రతి విషయంలో మరొకరితో సరిపోల్చి చూసుకుంటుంటారు. ఇతరులతో పోల్చుకోవడం అనేది మనిషికి ఉండే అతి పెద్ద మానసిక రుగ్మత. పరీక్ష రాసిన వెంటనే విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎలా రాశారో తెలుసుకునేందుకు కుతూహలం ప్రదర్శిస్తుంటారు. కార్యాలయంలో ఒకే రకమైన పనిని  తమ సహోద్యోగులు ఎలా పూర్తి చేస్తున్నారో తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. మరికొంత మంది సమర్ధత విషయంలో కూడా నిజమైన సమర్ధత కలిగిన వారిలాగా తాముకూడా ఉండాలని తపనపడుతూ ఉంటారు. విజేతలను చూసి అసూయ పడుతూ తాము కూడా విజేతలవ్వాలని అనవసర లక్ష్యాలు నిర్ణయించుకుంటారు. సరిపోల్చుకునే గుణం అలవడడానికి ముఖ్యకారణం మనిషిలో ఆత్మవిశ్వాసం కొరవడడం. ఇటువంటి భయంకరమైన సరిపోల్చుకునే మానసిక రుగ్మత నుండి ఎవరికి వారే బయటపడాల్సి ఉంటుంది. 

ప్రతి మనిషికి ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది. ఒక మనిషి ప్రవర్తనలో గాని, ఆలోచనలోగాని మరొకరితో ఏ విధమైన పోలిక ఉండదు. ఎవరికి వారే ప్రత్యేక మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చికుని, వారిలాగా మారే ప్రక్రియలో తమ అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తద్వారా తమలో ఉండే అంతర్గత శక్తి, ప్రతిభలను కూడా కోల్పోవడం జరుగుతుంది.  మనలో ఏమైనా అవలక్షణాలు ఉంటే మాత్రం వాటిని వొదిలించుకోవడానికి ప్రయత్నించాలి.

ఎవరికి వారే తమ గురించి తాము అవగాహన పెంచుకొంటూ, తమ సమర్థతను స్వయంగా అంచనా వేసుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం ద్వారా కలిగే సమస్యలను పరిగణనలోకి తీసుకోకపోవడం వలన తమ ప్రతిభకు తామే సంకెళ్లు వేసుకుంటున్నారని గ్రహించాలి. 

స్వతంత్రంగా వ్యవహరించే మనస్తత్వం కలిగినవారు ఇతరులు ఏది చెప్పినా అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఇలాంటివారు ఏ విషయాన్నయినా తమదైన శైలిలో తమ మనసుకు నచ్చితేనే అంగీకరిస్తారు. (కొందరు మూర్ఖత్వంతో కూడా అంగీకరించరు. అది వేరే విషయం. ఇక్కడ మనం మూర్ఖుల ప్రస్తావన తీసుకురావట్లేదు.)

విజేతలను ఆదర్శంగా తీసుకోవడం తప్పులేదు. కానీ పూర్తిగా వారిలాగా మెలగడానికి ప్రయత్నించడం మాత్రం సరికాదు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని, దానికి తమ విశిష్ట వ్యక్తిత్వాన్ని జోడించి కార్యసాధన చేయడం ద్వారా తప్పక విజయం సాధించగలరు. ఎవరికి వారే తమ వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుని తమదైన శైలిలో ప్రతిభను కనబరచే ప్రయత్నం చెయ్యాలి. చరిత్రను తరచి చూస్తే ఎందరో మహానుభావుల గొప్పదనానికి కారణం వారి విశిష్ట లక్షణాలే. వారిలోగల ప్రత్యేక లక్షణాలే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాయి. ఎవరైనా సరే తమ భావాలతో, ఆలోచనలతో లక్ష్యసాధనలో ముందుకు సాగుతూ ఉంటే తప్పక విజయాలు సాధిస్తారు. ఇతరులకు మార్గదర్శన చేయగలుగుతారు. 

విజయం సాధించడానికి కావలసిన తొలి ఆధారం “ఆత్మసంతృప్తి”. ఆత్మ సంతృప్తి ముందు సరిపోల్చుకునే ధోరణి ఎందుకూ పనికిరాదు. ఆత్మసంతృప్తి కలిగిన వ్యక్తి జీవితంలో దేనినైనా సాధించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వారు ఇతరులతో పోల్చుకోకుండా తాము చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. ఏది కోరుకుంటారో దానిని సాధించగలుగుతారు. 

ఇతరులతో పోల్చుకోవడం వలన మనిషి అసమర్దుడిగా తయారవుతాడు. దానివల్ల అప్రయత్నంగా ఇతరుల అదుపులోకి వెళ్లిపోయ పరిస్థితి కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి కలిగితే దానిని అదుపుచేయడం కష్టం. ఇతరులు మిమ్మల్ని ఏవిధంగా అంచనా వేస్తున్నారో కూడా తెలియదు. సరిపోల్చుకునే రుగ్మతవల్ల ఎవరికి వారు తమలా పనిచేయడం మరచిపోయి ఇతరుల మాదిరిగా పనిచేసే ప్రయత్నంలో ఉండి తమ ప్రతిభ వినాశనానికి తామే కారణమవుతారు.