దృష్టి ఉంచాల్సింది పనిమీదనే.... ఫలితం మీద కాదు

“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ”

కేవలం పని చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది. కానీ ఫలితం నీ చేతిలో లేదు.  .... భగవద్గీత 

సాధారణంగా మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు మన దృష్టి పొందబోయే ఫలితం మీద ఉంటుంది. ఒక విద్యార్థి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధుడవుతున్నప్పుడు అతడు తన ఫలితాలు వెలువడిన తరువాత రాబోయే మార్కులు ర్యాంకుల గురించి ఆలోచిస్తాడు. వాటి గురించే కష్టపడుతాడు. అదే విధంగా ఒక నిరుద్యోగి పోటీపరీక్షలకు సన్నద్ధత ప్రారంభించినపుడు తాను సాధించబోయే ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువంటి ఆలోచనలలో ఉన్నప్పుడు గతంలో ఎదుర్కొన్న వ్యతిరేక ఫలితాల గురించిన ఆలోచన మనసులోకి ప్రవేశించి ఒకసారి వ్యతిరేక ఫలితం వస్తే ఎలా అనే ఆలోచన కూడా మనసులో మెదులుతుంది. అప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న కర్తవ్యంపై మనసును లగ్నం చేయడం కష్టం. ఇటువంటి ఆందోళనకు లోనవకుండా ఉండాలంటే అంతకు ముందు తమకు వచ్చిన వ్యతిరేక ఫలితాల గురించి గానీ, భవిష్యత్తులో రాబోయే ఫలితాల గురించిగానీ ఆలోచించకుండా వర్తమానంలో ఉంటూ మనసును తమ సన్నద్ధత పైన మాత్రమే కేంద్రీకరించడం శ్రేయస్కరం. 

మన మనస్సులో ఫలితం గురించిన ఆలోచనలు చేయడం వలన, ప్రస్తుతం చేసే పనిలో సామర్థ్యం తగ్గిపోతుంది, నైపుణ్యం కూడా సన్నగిల్లుతుంది. అప్పుడు మన మెదడు సానుకూల ధోరణిని కోల్పోయి సమస్యలను పరిష్కరించే శక్తిని కోల్పోతుంది. భవిష్యత్తులో రాబోయే ఫలితం మీద మనస్సు పెట్టి ఆందోళన చెందడం కన్నా, ప్రస్తుం చేస్తున్న పని మీదే దృష్టి నిలపాలి. మన ప్రయత్నం సానుకూల ధోరణిలో సాగితే ఫలితం ఎప్పుడూ మనకు అనుకూలంగానే వస్తుంది. మన కర్తవ్య నిర్వహణకు అనవసరమైన పోటీతత్త్వాన్ని జోడిచంకుండా సహజంగా నిర్వహించగలిగితే మనసులో ఎటువంటి ఆందోళన కలుగదు. దానివల్ల అనుకున్న పనిని సక్రమంగా పూర్తిచేయగలుగుతాం. 

నేటి కాలంలో విద్యార్థులు సైతం పరీక్షల సమయంలో తమ మనస్సులో ఎటువంటి ఆందోళన లేకుండా తాము ప్రతిరోజు ఏ విధంగా చదువుతున్నారో, అదే విధంగా పరీక్షా సమయంలో కూడా ఉండగలిగితే రాయబోయే పరీక్ష గురించిన ఆందోళన దూరమయి తాము అనుకున్నదానికన్నా అత్యుత్తమ ఫలితాలు పొందగలుగుతారు. సరైన ప్రణాళికతో సంవత్సరమంతా చదివిన విద్యార్థికి పరీక్షల సమయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు.

జరిగినదాని గురించి, జరగబోయేదాని గురించి మనసులో ఆలోచన రాకుండా కేవలం వర్తమానంలో ఉండగలగడం ద్వారా, మనస్సును ఫలితం మీద కాకుండా పని మీద నిమగ్నం చేయడం, పోటీ భావన లేకుండా చేస్తున్న పనిని సహజంగా చేయగలగడం ద్వారా ఎటువంటి సందర్భంలో కూడా ఆందోళనను అధిగమించి తద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు.