విజయ సాధనలో సహనం కూడా ఒక ముఖ్య సోపానమే

 వ్యక్తిత్వ వికాస కథలు 

కొన్ని సందర్భాల్లో జయాపజయాలకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. మరో రెండడుగుల దూరంలో విజయం ఉండగానే నిరాశతో, అసహనంతో ఇక విజయాన్ని దర్శించడం మనవల్ల కానిపని అని కొందరు వెనుదిరుగుతారు. విజయం సాధించడానికి పట్టుదల, కృషి, కఠోర శ్రమ ఎంత అవసరమో సహనం కూడా అంతే అవసరం. ఒక్కోసారి అవరోధాలు నిరీక్షణ రూపంలో కూడా పరీక్షిస్తాయి. సహనంతో వ్యవహరిస్తే నిరీక్షణకు తగిన ఫలితాన్ని పొందగలము.

ఒక గురువుగారు తన శిష్యుణ్ణి జ్ఞానసాధనలో భాగంగా జనసంచారం లేని ఒక ఎత్తయిన పర్వత ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఒక మండలం(40 రోజులు) రోజుల పాటు ధ్యాన సాధన చేస్తే అమితమైన జ్ఞానం లభిస్తుంది, మనస్సులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ధ్యానం చేస్తే నీకు తప్పకుండా జ్ఞాననిధి దొరుకుతుంది అని చెప్పారు.

గురువుగారి మాట ప్రకారం బయల్దేరి శిష్యుడు పర్వత ప్రాంతాన్ని చేరుకుని, అక్కడ చెట్లు, పుట్టలులు తప్ప జనసంచారం, జీవసంచారం ఏదీ లేకపోవడం చూసి గురువుగారు చెప్పారు కాబట్టి ఇక్కడ తప్పక తనకు జ్ఞాన నిధి దొరుకుతుందని సాధన చేయడం మొదలు పెట్టాడు. ఇంకా రెండు రోజుల్లో గురువు గారు చెప్పిన గడువు పూర్తవుతుందనగా శిష్యుడికి సహనం నశించి, గురువుగారి పట్ల అనుమానంతో 'నేను అనవసరంగా ఈ జనసంచారం లేని ప్రాంతంలో సమయం వృధా చేస్తున్నానేమో, ఎవరూ లేనిచోట అసలు జ్ఞానసిద్ధి ఎలా కలుగుతుంది. ఎవరైనా బోధిస్తేనో లేదంటే ఎవరితోనైనా మాట్లాడితే గానీ లభించని జ్ఞానం ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే ఎలా వస్తుంది. ఇక్కడ చూస్తే ఒక్క నరమానవుడు సంచిరించిన దాఖలాలు లేవు' అని సందేహించి తిరుగు ప్రయాణమైనాడు.

కొండపై నుండి కిందికి దిగివస్తున్న శిష్యుడు “ఏ కారణం లేకుండా మండలం రోజులు నన్ను ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చోమని చెప్పడానికి గురువు గారు తెలివితక్కువ వారు కాదు కదా. అంటే నేనే తప్పు చేస్తున్నానేమో, ఇంకా రెండు రోజులైతే గురువు గారు చెప్పిన గడువు పూర్తవుతుంది. అప్పటికీ జ్ఞాననిధి లభించకపోతే గురువుగారిని నిలదీయచ్చు. ఇన్ని రోజులు కొండపై గడిపాను మరో రెండు రోజులు గడపలేనా” అని ఆలోచించి తిరిగి కొండపైకి వెళ్ళి మిగిలిన రెండు రోజులు ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. మండలం రోజులు ముగిసిన తరువాత అతను ఊహించిన దానికంటే ఎక్కువ జ్ఞాననిధి అతనికి లభించింది. అదే శిష్యుడు తిరిగి వచ్చేసి ఉంటే అతను కోరుకున్న అనంతమైన జ్ఞాననిధి అతనికి లభించేదికాదు.

ఏదైనా కార్యాన్ని సాధించడానికి పూనుకున్నప్పుడు ఆరంభంలో తమ శూరత్వాన్ని ప్రదర్శించి చివరిదాకా నిలబడలేక విజయానికి అడుగు దూరంలో వెనుదిరిగితే అంతవరకూ వెచ్చించిన కాలం, పడిన శ్రమ వృధా అవుతాయి. అదే సహనంతో ఉంటే విజయ శిఖరాలను చేరుకోవచ్చు.