విజయ సాధనలో కీలక అంశాలు

విజయ రహస్యాలు

మనం ఆచరించే ప్రతిపనిని విజయవంతంగా పూర్తిచేయడం అనేది మన చేతిలోనే ఉంటుంది. విజయాన్ని సాధించినవారిలో వారి కఠోర శ్రమతో పాటూ అతి తక్కువమంది విషయంలో మాత్రమే విధి అనుకూలించి ఉండవచ్చును. కానీ, అనేకమంది విషయంలో ఇది నిజం కాదు. వారి విజయానికి వారి పట్టుదల, దీక్షా దక్షతలే ముఖ్య కారణాలుగా నిలుస్తాయి. మన ఆలోచనలే మనం చేసేపనులను నియంత్రిస్తాయి. మన ఆలోచనలు మన మనస్సులోకి నిరంతరంగా ప్రయాణిస్తూ మనం ఆహ్వానిస్తున్న అంశాలకు ఆధారభూతమవుతాయి తప్ప కేవలం అదృష్టం మాత్రమే కాదు.

అదృష్టమే విజయాన్ని అందిస్తుందనే మాట వాస్తవమైతే నూటికి తొంభై మంది విజయం సాధిస్తారు. కానీ అది అసాధ్యం. అలాగని అపజయాలు చవిచూసిన వారందరూ పట్టుదలతో కృషి చేయలేదని కాదు. ఎంత ప్రయత్నించినా అపజయం మనల్ని వెన్నంటి ఉంటుందంటే మనం ఎక్కడో, ఏదో విషయంలో వెనుకబడి ఉన్నామన్న మాట అది కేవలం మనకు మాత్రమే తెలిసిన విషయం. అప్పుడు మనం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకున్ని వాస్తవాల్ని జీర్ణించుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించిన వారికీ అపజయం చవి చూసిన వారికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇద్దరూ పట్టుదలతోనే కార్యనిర్వహణ చేస్తారు. కానీ కొన్ని సార్లు ఏవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అపజయాలు చవిచూడాల్సి వస్తుంది. అంతమాత్రం చేత వారిని మొత్తానికి పరాజితులుగా నిర్ణయించడం తగదు. కానీ నిరంతరం పరాజయులుగా మారుతుంటే ఖచ్చితంగా వారు తమ లోపాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వారు ఎప్పటికీ, ఏ విషయంలోనూ, ఏ రంగంలోనూ విజయాన్ని సాధించలేరు. విజయసాధనలో ఆత్మపరిశీలన కూడా ఒక ముఖ్యమైన అంశం.

ఏ పని అయినా “నేను చేయగలను” అని మనం అనుకుంటే, మనం నిజంగా చేయగలమని మనమీద మనకు నమ్మకం కలిగితేనే ఆ పనిని ఏ విధంగా పూర్తిచేయాలో కూడా మనం తెలుసుకోగలుగుతాము. “అవును నేను చేయగలను” అని గట్టిగా పైకి అనడం వలన మనలో ఆత్మస్టెర్యం కలిగి అవే మాటలను మనస్ఫూర్తిగా నమ్మి. సాధనచేయడం వలన తప్పకుండా విజయాన్ని సాధిస్తాము. ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని తద్వారా మన శక్తిసామర్థ్యాలను తెలుసుకొని విజయాలను సాధిస్తూ జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించాలి.

ఇతరులకు సహాయ సహకారాలు అందించడం కూడా విజయ రహస్యంలో భాగమే. మనం ఇతరులకి ఇచ్చినదానికి తగినంత ప్రయోజనం ఖచ్చితంగా పొందుతాము. మనం పొందే ప్రయోజనం ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మనం పొందే ప్రయోజనం మనం ఇతరులకు ఇచ్చేదానిపై ఆధారపడి ఉంటుంది.

విజయం సాధించిన అనేకమందిని ప్రారంభంలో ఎంతో మంది నిరుత్సాహానికి గురిచేసి ఉంటారు. కానీ విజయం సాధించాలంటే అటువంటి మాటలను వట్టించుకోకపోవడం వల్లనే నేడు విజయం వారిని వరించింది. మనం ఏదైనా సాధించాలని సంకల్పించినప్పుడు మొదటగా మనకు అత్యంత ఆప్తులైన వారినుండే అనేక రకాల వ్యతిరేకపు మాటలు ఎదురవుతాయి. ఆ విధంగా పక్కదారి పట్టించేవారి మాటలు పట్టించుకోకుండా, పెడదారిపట్టకుండా ఉండడంలోనే మన విజయరహస్యం దాగి ఉంటుంది. ఈ విధమైన మనస్తత్వం ఉన్నవారే పట్టుదలతో తమ కలలను సాకారంచేసుకుంటారు. కృతనిశ్చయంతో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలి. ఇతరులు మనల్ని నమ్మకపోయినా ఫరవాలేదు కానీ మనమీద మనకు నమ్మకం పోయేలాగా జీవించరాదు.

విజయసాధన కోసం జీవితంలో కలిగి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు- కష్టపడి పనిచేయడం, మనస్పూర్తిగా పనిచేయడం, క్రమశిక్షణతో కూడిన శ్రమ, పట్టువదలనితత్వం మొదలైనవి. కృతజ్ఞతాభావాన్ని కలిగిఉండటం ద్వారా విజయాన్ని సాధించి పెట్టే లక్షణాలను గుర్తించి వాటిని గౌరవించి ఆచరించడం ద్వారా జీవితంలో విజయాలను సాధించగలము.

విజయసాధనలో అతి ముఖ్యమైన అంశం నిరంతర అభ్యాసం. విజయ సాధకులు నిరంతర విద్యార్థులుగా ఉండాలి. ఎప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూ, మనలో లేని నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో మనతో మనమే పోటీపడి, గెలవటం అలవాటుచేసుకోవాలి. మనతో మనకు పోటీ ఉన్నప్పుడే, మనకు మనం సాటిలేని వారము అవుతాము తద్వారా ఎటువంటి పోటీకయినా సర్వత్రా సిద్ధంగా ఉండగలుగుతాము. ఈ పోటీతత్వమే మనకు విజయాల్ని సాధించి పెడుతుంది.

నిజాయితీ కలిగిఉండడం, నియమబద్ధమైన వ్యక్తిత్వం, మన పైన మనకు గల నమ్మకం, ఇతరుల పట్ల విశ్వాస పాత్రమైన జీవనవిధానం, మనం నెరపే ధర్మబద్ధమైన ప్రవర్తన మొదలైన విలువలే విజయసూత్రాల మూలస్థంబాలు. ఈ విలువల పునాదులపై జీవితమనే భవనాన్ని నిర్మించడం ద్వారా ప్రేమ, సుఖసంతోషాలు, భద్రత, అపురూపమైన స్నేహాలు, శాంతి, ఆరోగ్యం, సంపద వంటివి పొందగలుగుతాము. ఇవన్నీ కూడా విజయానికి హేతువులుగా మారతాయి.

మన విజయానికి మనమే వ్యూహకర్తలుగా వ్యవహరించాలి. మనం రచించిన వ్యూహాలను మనస్పూర్తిగా అమలుపరిచినప్పుడే విజయాన్ని సొంతం చేసుకోగలుగతాము. మన విజయమనేది వేరే ఎక్కడో లేదు మనలోనే ఉందనే విషయాన్ని గ్రహించి విజయసాధనలో ముందుగా సాగాలి.