అవరోధాలే అవకాశాలు

 వ్యక్తిత్వ వికాస కథలు 

రోహన్, రోహిత్ లు మంచి స్నేహితులు. ఇద్దరూ పదవ తరగతి చదువుతున్నారు. ఒకరోజు వారి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కప్ప జీవితచక్రం పాఠ్యాంశాన్ని బోధిస్తూ లార్వాదశ నుండి పరిణామం చెంది కప్పగా పరిణామం చెందడం వివరించాడు.

రోహన్, రోహిత్ ఇద్దరూ తెలివైన విద్యార్థులు కావడంతో వారి ఉపాధ్యాయుడు బోధించిన విషయాన్ని ప్రయోగపూర్వకంగా చూడాలనే ఉద్దేశ్యంతో ఇద్దరూ ఒక అక్వేరియం సెంటర్ కి వెళ్ళి చెరొక అక్వేరియం తెచ్చుకున్నారు. అందులో ఉన్న లార్వాలకు తగినంత ఆహారాన్ని సమకూరుస్తూ ప్రతిరోజు ఆనందించేవారు.

కొన్ని రోజుల తరువాత రోహన్ తన అక్వేరియంలో లార్వాలు తోకలు ఊడి కప్పలుగా మారడం గమనించి మాస్టారు చెప్పింది నిజమేనని రూఢీ చేసుకున్నాడు. పాఠశాలలో రోహిత్ కు ఈ విషయాన్ని చెప్పాడు. కానీ రోహిత్ తన లార్వాలు ఇంకా కప్పలుగా మారలేదని, మాస్టారు చెప్పింది తప్పని వాదించసాగాడు. ఇద్దరూ తమ మాస్టారు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని అడిగారు.

సాయంత్రం పాఠశాల సమయం పూర్తయిన తరువాత మీ ఇద్దరి ఇళ్ళకు వచ్చి అక్వేరియంలను చూసి అలా ఎందుకు జరిగిందో చూస్తానని చెప్పి పంపడంతో ఇద్దరూ తమ తరగతి గదికి వెళ్ళిపోయారు.

సాయంత్రం మాస్టారుతో ముందుగా రోహన్ ఇంటికి వెళ్ళి అక్వేరియంని పరిశీలించాడు. నిజంగానే లార్వాదశ నుంచి కప్పగా పరిణామం జరిగింది. అక్కడి నుండి ముగ్గురూ కలిసి రోహిత్ ఇంటికి బయల్దేరారు. లార్వాలు ఇంకా తోకతో ఉండి కప్పగా పరిణామం చెందలేదు. రోహిత్ అక్వేరియంను పరిశీలించిన మాస్టారికి విషయం అర్థం అయింది. విషయాన్ని ఇద్దరికీ అర్థం అయ్యేలాగా వివరించాడు.

“రోహిత్ నీ అక్వేరియంలో తగినన్ని రాళ్ళు లేవు. అందుకే లార్వాలు కప్పలుగా ఎదగలేదు” అని చెప్పాడు.

“లార్వా కప్పగా మారడానికి, రాళ్ళకు సంబంధం ఏమిటి” అని రోహిత్ మాస్టారుని ప్రశ్నించాడు.

మాస్టారు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, “నీటిలో రాళ్ళు ఉంచడం వలన ఆ రాళ్ళపైకి లార్వాలు ఎక్కడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వాటి తోకలు తెగి, వాటి కాళ్ళ కండరాలలో బలం పుంజుకొని అవి కప్పలుగా మారి గెంతగలుగుతాయి. నీ అక్వేరియంలో సరైన పరిమాణంలో రాళ్ళను ఉంచితే నాలుగు రోజుల్లో లార్వాలు కప్పలుగా తప్పకుండా పరిమాణం చెందుతాయి” అని వివరించాడు.

ఇదే విధంగా "మీ జీవితంలో కూడా ఏవైనా సమస్యలు ఎదురైతే మీ బుద్ధి కుశలతలో పరిణామం సంభవించి ఉన్నతిని పొంద గలుగుతారు. ఈ ఉదాహరణ ప్రతి విషయానికి వర్తిస్తుంది” అని వివరించడంతో ఆ ఇద్దరికీ అసలు విషయం బోధపడింది.

మనందరి జీవితాలు కూడా వికాసంతో ముడిపడి ఉంటాయి. వికాసమే లేకపోతే మనిషిలో పరిణామం అనేది కలుగదు. మనిషికి సృష్టి ప్రసాదించిన గొప్ప వరం వివేకంతో ఆలోచించండం. మనిషిలో జరిగే బాహ్య మరియు అంతర్గత సంఘర్షణల కారణంగా వికాసానికి మార్గం సుగమమం అవుతుంది. మనిషి బుద్ధిలో వికాసం సంభవించినప్పుడే ఎటువంటి అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలచుకుని విజయాలను సునాయాసంగా సాధించగలడు.

ఎదురైన ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటే ఎన్నటికి నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అవరోధాల పట్ల వ్యతిరేక దృక్పధాన్ని విడనాడి వాటిని అవకాశాలుగా భావిస్తే జీవితంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు.