విజయసాధనలో సమయ పాలన

మనలో చాలామంది సాధారణంగా తమ పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోవట్లేదని అనడం వింటుంటాము. కానీ అనేక సందర్భాలలో ఇది నిజంకాదు. ఒక రోజు పూర్తయిన తరువాత ఈ రోజు మనం ఏం చేశామని ఒక్కసారి పరిశీలిస్తే మనకు అవసరం లేని పనులు చేసి చాలా సమయం వృధా చేసినట్లు తెలుస్తుంది. అనవసర విషయాలకు కేటాయించిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. మన జీవితంలో అన్నిటికన్నా విలువైనది సమయం మాత్రమే. ఎందుకంటే మిగతా అంశాలు వేటినైనా మనం తిరిగి పొందగలం ఒక్క కాలాన్ని తప్ప. 

సాధారణంగా విజయం సాధించిన వారిని పరిశీలిస్తే వారు తమ జీవితంలో లక్ష్యసాధనకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా తాము అనుకున్నది సాధించామని చెబుతారు. మనందరికీ రోజులో ఉండేది 24 గంటలే కానీ సమయపాలన లేని వారికి రోజులో ఇంకా సమయం ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాధారణంగా మనం రోజుకు నాలుగు గంటలు కాకుండా ఎనిమిది గంటలు పని చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతామని అనుకోవడం సహజం. కానీ ఇది నిజం కాదు. తక్కువ సమయంలో ఒక విషయం పై దృష్టి సారిస్తే ఎనిమిది గంటలలో సాధించే ఫలితం రెండు గంటల్లోనే సాధించే అవకావశం ఉంటుంది. పరధ్యానంతో కూడిన ఎనిమది గంటలు పని చేసినా, చేస్తున్న పనిమీదనే ఎక్కువ దృష్టి నిలపడం వలన అదే పనిని రెండు గంటల్లో సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చు. 

ఒక రోజును భాగాలుగా విభజించడం వలన అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. రోజును ఎన్ని భాగాలుగా విభజించాలనే విషయం వారి వారి అనుకూలతలు, జీవనశైలి ప్రకారం నిర్ణయించుకోవాలి. 

లక్ష్యసాధనలో సమయ పాలనకు ఉపయోగపడే మార్గాలు

  • సమయ పాలనకు సంబంధించిన సాధనాలను ఉపయోగించడం ద్వారా అనుకున్న పనులు పూర్తిచేయవచ్చు. ఇందులో భాగంగా ఒక అధునాతన సాఫ్ట్ వేర్ లేదా పెన్ను మరియు కాగితం ఏదైనా ఉపయోగించి చేయాల్సిన పనులను గురించిన వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా రోజువారీ పనులను ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ పనికి ఎంత సమయాన్ని కేటాయించిలి అనే విషయాల గురించి ఒక అవగాహన కలుగుతుంది. 
  • రోజులో చేయాల్సిన పనుల ప్రాధాన్యత జాబితాను తయారుచేయడం ద్వారా అత్యంత ముఖ్యమైన అంశాలను ముందుగా పూర్తిచేస్తూ మిగతా సమయాన్ని తరువాతి అంశాలకు కేటాయించడం ద్వారా మన పనులను సరైన సమయంలో సమర్ధవంతంగా పూర్తిచేయవచ్చు. రోజు పూర్తయిన తరువాత ఆ జాబితాను ఒకసారి పరిశీలించి, సమయపాలనతో మనం పూర్తిచేసిన పనులను చూసుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఒక వేళ ఏవయినా పూర్తికాని పనులుంటే అవి వెంటనే చేయాల్సిన అవసరం లేనివని గుర్తించాలి. 
  • పనులను సమర్ధవంతంగా సమయంలోపు పూర్తిచేయడానికి ఒక దినచర్యను పాటించడం ద్వారా మరింత వ్యవస్థీకృతంగా పనులను పూర్తిచేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సమయపాలన మరింత సులువవుతుంది. 
  • ఒక ఖచ్చితమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏ సమయంలో ఏ పని చేయాలో తెలుస్తుంది. తద్వారా సమయానుగుణంగా పనులను నిర్వహించడానికి వీలువుతుంది. దీని ద్వారా ఒక పనిని పూర్తి చేయడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. సరైన ప్రణాళిక ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను అనుకున్న సమయంలోపు సాధించడానికి వీలవుతుంది. 
  • సరైన ప్రేరణ లేకపోవడం మనలో ఉండే ప్రధాన అంతర్గత శత్రువు. మొబైల్ ఫోన్, టి.వి., సినిమాలు, సోషల్ మీడియాలో గంటల తరబడి కాలక్షేపం మొదలైనవి మన ప్రధాన బాహ్య శత్రువులు. ఇటువంటి అనవసర ప్రభావాలు మన సమయాన్ని హరించి తద్వారా లక్ష్యాన్ని చేరడానికి ఆటంకాలుగా మారతాయి. వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. 
  • సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వలన సమయం వృధా అవుతుంది. ఇటువంటి అనవసర చర్యలవలన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని వృధా చేయరాదు. 
  • లక్ష్యసాధనకు సరైన మార్గం కనిపించనపుడు మన శ్రేయోభిలాషుల సహాయం తీసుకోవడం ద్వారా సరైన సమయంలో పనులు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని మనకు సహాయం చేయాల్సిందిగా అడగడంలో ఎటువంటి తప్పులేదు. పై పెచ్చు మనమంటే అభిమానం ఉండి, మనం ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్నామని తెలసిన వారు కావడం వలన మరింత ఉత్సాహంతో సహకరిస్తారు. దీనివలన మన సమయం వృధాకాకుండా అనుకున్న సమయంలోపే అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయగలుగుతాము.