కష్టాల కడలిని దాటిన వారే విజయ తీరాన్ని చేరుతారు

మనిషి జీవితమంటేనే సంఘర్షణ. కష్టపడకుండా పూర్తయ్యే పని ఈ లోకంలో ఏదీ లేదు. శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పుడే అనుకున్న కార్యం పూర్తవుతుంది. జీవితంలో విజయమే కావాలని సంకల్పించినప్పుడు మన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించాల్సి ఉంటుంది. నిశ్చయించుకున్న దానిని సాధించడం కోసం మన సంపూర్ణ వ్యక్తిత్వశక్తిని సంకల్పంతో పాటు కలపాల్సి ఉంటుంది. సగం మనస్సుతో ఏపని చేయరాదు. మనస్సును పూర్తిగా పనిలో నిమగ్నం చేసిన వారికి మార్గం తనంతటతానే ఏర్పడుతుంది. 

ఎవరైతే కష్టాల గురించి పదే పదే ఆలోచిస్తారో వారినే అవి ఎక్కువగా బాధ పెడతాయి. కష్టాలను గూర్చిన ఆలోచనలతో ఏర్పడే భయం కారణంగా మనం ప్రయాణం చేయబోయే మార్గాన్ని విడిచి పెట్టే పరిస్థితి తలెత్తుతుంది. ఇటువంటి ఆలోచనలు చేసేవారు జీవితంలో ఎప్పటికీ సఫలత సాధించలేరు. నిజానికి ప్రతివ్యక్తి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయితే ఈ బాధలన్నింటినీ సహించి తన పనిపై మాత్రమే దృష్టి నిలిపి పనిని పూర్తిచేస్తాడో అతడే విజయుడవుతాడు. తపస్సు చేయనిదే లోకంలో ఖ్యాతి పొందడం సాధ్యం కాదు. (ఇక్కడ తపస్సు అంటే అడవులలోకి వెళ్ళి ముక్కు మూసుకుని భగవంతుడిని ధ్యానిస్తూ చేసే తపస్సు అని అర్థం కాదు. మనుష్యుల మధ్య ఉంటూనే మన పనిలో మని నిమగ్నులమై దేని గురించి ఆలోచించకుండా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మనస్సును కేవలం చేయబోయే పనిమీద నిలపడం.) ఈ లోకంలో ఎవరికి ఎంత ఎక్కువ ఖ్యాతి ఉందో వారు అంత ఎక్కువగా తపస్సు చేశారని అర్థం. 

పూర్వకాలంలో క్షత్రియుడు యుద్ధం చేయడంలోనే గొప్పదనం ఉందని భావించేవాడు. పారిపోవడంలో కాదు. అదే విధంగా ప్రస్తుత కాలంలో మన జీవితంలో నిత్యం అనేక యుద్ధాలు చేస్తూ ఉంటాం. గెలుపు, ఓటములను పక్కన బెట్టి యుద్ధం మాత్రమే చేయాలి. పిరికితనంతో పారిపోకుండా యుద్ధరంగంలో చివరిదాకా నిలిచిన వాడు ఓడిపోయినా గెలిచిన వాడితో సమానం. 

పూర్వకాలం నుంచి ఏ రాజ్యాన్ని చూసిన, ఏ దేశ చరిత్రను వెలికితీసినా నాగరికత యొక్క వికాసం సంఘర్షణతో ముడిపడి ఉంటుంది. బ్రిటీషు పరిపాలనలో భారతదేశ ప్రజలు బానిసల లాగా బ్రతుకున్ను వెళ్ళదీస్తున్న కాలంలో ఆనాటి మన పెద్దలు స్వాతంత్ర్యం కొరకు పోరాడకపోయి ఉంటే, మనవారంతా కుటుంబాల్ని, సుఖభోగాలనన్నింటినీ త్యాగం చేసి ఆత్మార్పణ చేయకపోయి ఉంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతికేవారమా. వారి జీవితాలను త్యాగం చేయకుండా ఉంటే ఈరోజుకి కూడా పరాయి పాలనలో మగ్గుతూ ఉండేవాళ్ళం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం వెనుక కూడా ఒక గొప్ప సంఘర్షణ ఉన్నది. ఆ రోజు మహాత్ముల తపస్సు ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో బ్రిటీష్ వారితో మన పూర్వీకులు యుద్ధం చేయక పోతే అది సాధ్యమయ్యేదా. ఒక పసి పిల్లవాడు కింద పడిపోతాడని భయపడి అతడికి నడకనేర్పక పోతే అతను ఎప్పటికీ నిలబడలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. కష్టాలకు భయపడ రాదు, వాటికి ఎదురొడ్డి నిలబడి పోరాడడం నేర్చుకోవాలి. 

మనం జీవితంలో నిశ్చయించుకున్న ఆదర్శాలను రక్షించుకోటూ జీవించడానికి కష్టాలతో యుద్ధం చేయడం తప్పదు. జీవితంలోని ప్రతి దశలోనూ కష్టాలు ఎదురవుతాయి. విద్యార్థి దశలో చదువులో కష్టాలు, యుక్తవయుస్సులో జీవితంలో స్థిరపడడం కోసం కష్టాలు, ఉద్యోగ జీవితంలో వృత్తిపరమైన కష్టాలు, వార్ధక్యంలో వయస్సు రీత్యా ఏర్పడే కష్టాలు ఈ విధంగా ప్రతిదశలో ఏదో ఒక కష్టాన్ని చూడని వారు లోకంలో ఎవరూ ఉండరు. ప్రతి దశలో అందుకు తగిన యుద్ధాన్ని చేస్తూనే ఉండాలి.

లోభులు, మోసకారులు, ఈర్ష్యపరులు ఎంతోమంది మన ఉన్నతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, వారు మాత్రం సుఖంగా బ్రతుకుతుంటారు. కానీ మనం సత్యాన్ని, ధర్మాన్ని, ఆదర్శాలను ఆచరిస్తూ జీవించడమనేది చాలా కష్టం. ధర్మమార్గంలో ప్రయాణించడం చాలా కష్టమైన పని. ఈ మార్గంలో ఎన్నో రకాల ప్రలోభాలు, కష్టాలు ఎదురవుతాయి. బలహీన క్షణంలో ఒక్కసారి తప్పుడుమార్గంలో ప్రయాణిచండం వలన క్షణికానందం లభించినా, జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. లోకంలో అక్రమ మార్గాల ద్వారా ధనం సంపాదించే వారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఆదర్శాలకు అనుగుణంగా జీవిస్తూ ధనాన్ని సంపాదిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. మన జీవితానికి డబ్బే ముఖ్యం అనుకుంటే మనం కూడా వీరి మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళి న్యాయంగా డబ్బు సంపాదించి ధనవంతులు జాబితాలో చేరవచ్చు. కానీ మనశ్శాంతి ముఖ్యం అనుకుంటే మాత్రం మనకు నచ్చిన మార్గంలో ప్రయాణించి మన లక్ష్యాన్ని చేరుకోవడం ఉత్తమం. ఎందుకంటె "ధనహీనమయినదయినా స్వధర్మమే ఉత్తమం".