కర్తవ్య నిష్ఠతో సాగే నిరంతర పరిశ్రమ, సాహసాలే జీవితంలో సఫలతకు మూలాలు

ఒక లక్ష్యాన్నంటూ నిశ్చయించుకున్న తర్వాత దాని చేరడానికి మనస్సును ఏకాగ్రం చేయాలి. తక్కినవన్నీ మరచిపోయి కేవలం లక్ష్యసిద్ధి కొరకు మాత్రమే ప్రయత్నించాలి. ఎటువంటి గొప్ప కార్యమైనా ఒక్కరోజులో పూర్తికాలేదు. ఇప్పటి వరకు మనం గమనించిన అన్ని అన్వేషణలు, పరిశోధనలు, ఏకాగ్రత ద్వారానే సాధించబడినవే. ఏ రంగానికి సంబంధించిన ఆవిష్కరణ చరిత్ర చూసినా మనిషి యొక్క కఠోర పరిశ్రమ యొక్క ఫలితమే అని తెలుస్తున్నది. 

చేసే పనిలో ఎక్కువ తక్కువలనేవి ఉండవు. ప్రతి పనిలోనూ ఏదో గొప్పతనం దాగి ఉంటుంది. అది చేసే వారి మనసుకు మాత్రమే తెలుస్తుంది. మన కళ్ళతో చూసేది మాత్రమే విజయం కాదు. ప్రతి పనిలో మన కంటికి కనిపించని విజయం కూడా ఉంటుంది. దానిని దర్శించగలిగితే ప్రతి వ్యక్తి విజయుడైనట్లే కనిపిస్తాడు. మన దృష్టిని సవరించుకుని దానిని దర్శించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఆలోచించగలిగితే ప్రతిపనిలోనూ ఉన్నతిని చూడవచ్చు. 

ఏ కార్యం చేపట్టినా, మనస్ఫూర్తిగా స్వీకరించి, అంకిత భావంతో దానిని సాధ్యమైనంత అందంగా తీర్చిదిద్దుతాను అని నిశ్చయించుకొని పనిని మొదలు పెట్టాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది.

లక్ష్యాన్ని నిశ్చయించుకోవడం అత్యంత సులభం కానీ అనునిత్యం దానినే స్మరిస్తూ, దానిని పొందడానికి ప్రయత్నం చేయడమే అత్యంత కఠినం. లక్ష్యసాధన మార్గంలో పయనం చేస్తున్నప్పుడే అది ఎంత కఠినమో అర్ధమవుతుంది. ఎట్టి పరిస్థితులలో కఠినతల ముందు తలవంచవద్దు. ఓటమిని అంగీకరించకపోవడం, కఠినత మీద దృష్టి నిలపకపోవడం ద్వారానే ముందుకు లక్ష్యం వైపు పయనం సాగుతుంది. కఠినత ఉన్నచోట పౌరుషం ప్రదర్శించాల్సి ఉంటుంది. పౌరుషం ఉన్నచోటే విజయం పొంచి ఉంటుంది. 

పరిశ్రమే విజయానికి మూలమని గుర్తించాలి. ఎవరయితే రేయింబవళ్ళు తన కర్తవ్యనిష్ఠలో నిలిచి ఉంటాడో వారే ముందుకు పురోగమించగలరు. సఫలతను పొందిన ఏ గొప్పవ్యక్తి జీవితాన్ని తరచి చూసినా అతడు తన జీవితంలోని ప్రతిక్షణాన్ని సద్వినియోగపరుచుకున్నాడని తెలుస్తుంది. విజయం కోసం కఠిన పరిశ్రమను మించిన మార్గం ఏదిలేదు. చేసే పనిమీద గౌరవమే మనకు కలిగి అన్ని అపజయాలను దూరం చేసి చివరికి విజయం ముంగిట మనల్ని నిలుపుతుంది. 

ఎన్ని సార్లు అపజయం పొందినా నిరాశ చెందక మళ్ళీ మళ్ళీ విజయం కోసం ప్రయత్నించడం, వైఫల్యం ఎదురైనా నిరాశ చెందక పోవడమే నిరంతర పరిశ్రమ. బల్బును కనుగొనే ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమైనా ఎడిసన్ చేసిన నిరంతర పరిశ్రమ, ప్రయత్నాలే అతని విజయానికి కారణాలైనాయి. నిరాశ నిస్పృహలను తన దరికి రానీయకుండా ఉన్నవాడే ఏదో ఒక రోజు తన లక్ష్యాన్ని చేరగలుగుతాడు. లక్ష్యంవైపు ప్రయాణం సాగిస్తున్న వ్యక్తికి ఎప్పటికీ నిరాశ కలగదు. ఎందుకంటే అతడి దృష్టి మొత్తం సాధించిన దానిమీదనో లేదా పోగొట్టుకున్న దానిమీదో ఉండదు. అతడి ధ్యాసంతా కేవలం తన కర్తవ్యపాలన మీదే ఉంటుంది. తన కర్తవ్యంలో మనస్సుని లీనం చేసినవాడు ఎప్పటికీ సంతోషంతోనే ఉంటాడు. అన్నిటికంటే ఎక్కువ సంతోషం తాను ప్రారంభించిన పని పూర్తయినప్పుడు పొందుతాడు.