విజేతలు Vs పరాజితులు

విజయ రహస్యాలు

  • ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే మనిషి సంసిద్ధతే తొలిమెట్టు. మనిషిలో సంసిద్ధత ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. సంసిద్ధత వలన అపజయం ఎదురయితే విజేత ఓర్పు వహించగలడు గాని ఆమోదించలేడు. ఓటమిని ఎదుర్కొనే సాహసం అలవరచుకుంటాడుగాని ఓటమిని అంగీకరించడు. నిరుత్సాహపడినా ధైర్యాన్ని కోల్పోడు.
  • సంసిద్ధత అంటే చేసిన తప్పుల నుండి నేర్చుకోవడం. తప్పులు చేయడం తప్పుకాదు. తప్పులు అందరూ చేస్తారు. కానీ సరిదిద్దుకునే లక్షణాలున్న వారే విజేతలవుతారు. తెలివితక్కువ వ్యక్తి ఒకే తప్పు రెండుసార్లు చేస్తాడు. తప్పుచేసిన వ్యక్తి చేసిన తప్పుని సవరించుకోకపోతే మరింత పెద్ద తప్పు చేస్తాడు ఇది పరాజితుల లక్షణం.
  • ఒకేసారి అనేక సమస్యలు మీదపడి దండయాత్ర చేస్తూ ఉంటే, ఆ పనిని వదలి వెళ్లిపోవడమే సులువైన మార్గంగా భావించేవారు పరాజితులు. విజేతలు ఎదురు దెబ్బలు తింటారు కానీ తమ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఓటమిపాలవడం అంటే పరాజయం పొందినట్లు కాదు, మరింత ప్రయత్నించాలని అర్థం.
విజయరహస్యం కేవలం రెండు మాటల్లోనే దాగి ఉంది. అవి పట్టుదల, సమస్యలకు ఎదురొడ్డి నిలబడడం. ఏమి జరగాలో జరిపించడం పట్టుదల, ఏమి జరగకూడదో దానిని జరగకుండా ఎదిరించి నిలబడడమే విజయరహస్యం.
  • పరాజితులకు పట్టుదల ఉండదు. పరాజితులు ప్రతి విషయంలోను అప్పటికప్పుడు వచ్చే ఫలితాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. దీర్ఘకాల ప్రయోజనాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించరు. వీరి దృష్టి పరిమితంగా ఉంటుంది.
  • విజయం అనేది కొన్ని సూత్రాల సమాహారం. ఈ సూత్రాలన్నీ ప్రకృతి సూత్రాలు. ప్రకృతిలో 'మార్పు' అనేది ఒక సూత్రం. అంటే మనం పురోగామి దిశలోనైనా ఉండవచ్చు, తిరోగామి దిశలోనైనా ఉండవవచ్చు. అదేవిధంగా మనం సృష్టిస్తూ ఉండవచ్చు, విఘటనం చెందుతూ ఉండవచ్చు. జీవితాంతం ఎవరూ కూడా ఒకేలాగా ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు సంభవిస్తుంటాయి. మార్పు అనేది ఒక అనివార్య చర్య. ఒక వ్యక్తి జీవితంలో మార్పు సంభవిస్తుందంటే అతను త్వరలో విజేత కాబోతున్నట్లు అర్థం.
  • పరాజితులకు ప్రకృతి సూత్రాలపై ఏమాత్రం అవగాహన ఉండదు. ప్రణాళికలు వేసుకునే నైజం ఉండదు. తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకోరు. బాధ్యత స్వీకరించరు. వీరికి విషయపరిజ్ఞానం కూడా ఉండదు. తమ ప్రతిభను వినియోగించుకునే ప్రయత్నం కూడా చేయరు.
కారణాలు ఫలితాలు ఈ రెండూ మనిషి విజయాన్ని నిర్ణయిస్తాయి. పరాజయానికి గల కారణాలను వినడానికి ఎవరూ ఇష్టపడరు. కేవలం ఫలితాలు వినడానికి మాత్రమే ఇష్టపడతారు.
  • తమ తప్పులను ఎదుటివారి మీదకు తోసెయ్యడం పరాజితుల లక్షణం. ఇతరుల మీద తమ తప్పులను తోసి తాము విశ్రాంతి తీసుకుంటారు. కానీ విజేతలు తమ తప్పులకు తామే బాధ్యత వహిస్తారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు.
  • పరాజితులు ప్రాధాన్యతలు సరిగా ఎంచుకోలేక కాలాన్ని వృధా చేసుకుంటారు. ఏది ముందు చేయాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలు వీరికి తెలియవు. చేసే పనిలో ప్రాధాన్యతలను గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్రమశిక్షణ అవసరం. విజేతల వద్ద ఇది అవసరమైనంత ఉంటుంది. అందుకే విజేతలు ప్రతి పనిని ఒక ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి చేస్తారు.
  • ప్రణాళిక తయారు చేసుకుంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ప్రణాళికలు తయారు చేసుకుని ఆచరణలో పెట్టేందుకు సాధన చేయాలి. విజేతలు తమను తాము ఒత్తిడికి గురిచేసుకుంటూ ఈ పనులన్నీ చేస్తారు. వారికి విజయం సాధించడంలో ఎటువంటి ఆందోళనకు లోనవరు.
  • పరాజితులకు ప్రకృతి సూత్రాలపై ఏమాత్రం అవగాహన ఉండదు. ప్రణాళికలు వేసుకునే నైజం ఉండదు. తప్పుల నుండి నేర్చుకోరు. బాధ్యత స్వీకరించరు. విషయపరిజ్ఞానం ఉండదు. భయం! అవకాశాన్ని గుర్తించలేరు. తమ ప్రతిభను వినియోగించుకోలేరు.
  • విజేతలు తాము చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటారు. విజేతలు తమ అపజయానికి కారణాలు చెప్పరు. హేతువాద దృక్పథంలో ఉండరు. హేతువాదం పరాజితుల మంత్రంగా ఉంటుంది. పరాజితులు ఓటమికి అనేక కారణాలు వెతుకుతూ, చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
  • చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోనివారు పరాజితులుగా మిగిలిపోతారు. మనకు సరైన దృక్పథం ఉంటే పరాజయం మనకు గురువు. అపజయం అనేది ముగింపు కాదు విజయానికి మార్గం చూపించే మార్గదర్శి అని గ్రహించగలగాలి.
  • అపజయం విజయాన్ని ఆలశ్యం చేసేదిగా మాత్రమే గుర్తించాలి, ఓటమిగా కాదు. పరాజితులు తాము చేసే తప్పులను తమ అందమైన అనుభవాలుగా చెప్పుకుంటారు. కానీ విజేతలు తమ తప్పుల నుండి కొత్త విశేషాలు నేర్చుకుంటారు.
మన జీవితంలో ఒక్కొక్కసారి అవకాశాలు అవరోధాల రూపంలో ఎదురవుతూ ఉంటాయి. అవరోధం అనుకుని దానిని గుర్తించలేము. ఎంత పెద్ద అవరోధం ఎదురైతే మనకు అంత పెద్ద అవకాశం వచ్చినట్లు అర్థం.
  • భయం అనేది నిజం కావచ్చు లేదా భ్రమకూడా కావచ్చు. సరైన అవగాహన లేకపోవడం వలన మనిషిని భయం ఆవహిస్తుంది. భయంలో మనిషి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ, వింతపనులు చేస్తాడు. భయంతో జీవించడం అనేది ఒక రకమైన ఉద్రేకపూరితమైన ఖైదులో నివసించడమే! భయం మనిషి శక్తిని, సామర్ధ్యాన్ని నాశనం చేస్తుంది. ఇటువంటి విషయాలకు పరాజితులు బానిసలుగా ఉంటారు. కానీ వీటన్నింటిని జయించగలిగినవారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు.