పనిలో కౌశలాన్ని సాధించిన వారే విజయ సాధకులవుతారు

ప్రతి మనిషి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ద్వారా జీవితంలో సంతోషాన్ని పొందగలుగుతాడు. ఎవరు ఏ రంగంలో తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటారో ఆయా రంగాలలో తగిన కౌశలాన్ని(నైపుణ్యాన్ని) సాధించడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఏదైనా విషయాన్ని పూర్తిగా నేర్చుకుంటే కౌశలాన్ని సాధించినట్లే. కౌశలాన్ని సాధించిన వ్యక్తి తాను చేస్తున్న పనిలో నిపుణుడుగా తయారవుతాడు.

సాధారణంగా ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనిని కేవలం అవసరమైనంత వరకే మాత్రమే నేర్చుకుని తద్వారా విజయం సాధించాలనుకుంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ నేర్చుకోవడాన్ని వృధాశ్రమగా భావిస్తారు. ఒక పదవ తరగతి విద్యార్థి తరగతిలో బోధించిన పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాల్ని మాత్రమే నేర్చుకుంటే అవి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించడానికి పనికి వస్తాయే కానీ, అతడి ఉన్నతికి పనికిరావు. అవసరమైనంత వరకు నేర్చుకునే విధానం తాత్కాలిక విజయాల్ని ఇస్తుంది, జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడదు. అంతంతమాత్రంగా నేర్చుకున్న విద్య జీవితంలో దేనికి పనికిరాదు.

ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకన్నామని, ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదనేంతగా నేర్చుకోగలగాలి. దానికొరకు అభ్యాసం చేయాలి, అనేక రకాల పుస్తకాలు చదవాలి, సాధ్యమైతే గురువులతో చర్చించాలి. ఎన్ని రకాలుగా వీలేతై అన్ని రకాలుగా ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

పరీక్షలకు అవసరమైనంత వరకు మాత్రమే చదివి నెగ్గుకురావడం అంటే విషయం మీద పూర్తి పట్టు సాధించినట్లు కాదని గ్రహించాలి. నిజ జీవిత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఏదైనా విషయాన్ని నేర్చుకోవాల్సిన సమయంలో పూర్తిగా నేర్చుకోకపోవడం వలన నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవ్వాల్సి వస్తుంది.

సివిల్ సర్వీసెస్ పరీక్షల కొరకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన తరువాత తమ సన్నద్ధతలో భాగంగా ప్రాథమిక అంశాల కోసం మళ్ళీ పాఠశాల పుస్తుకాలను చదవడం ఇదే కోవలోకి వస్తుంది. పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల పూర్తి పరిజ్ఞానాన్ని పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే సంపాదించి ఉంటే వారికి సివిల్స్ సన్నద్ధత సమయంలో ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇతర కఠినమైన అంశాలను నేర్చుకునేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. విద్యార్ధి దశలో సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా నిర్ణయించుకోనప్పటికీ పాఠశాల స్థాయిలోనే పూర్తి విషయం పరిజ్ఞానం పొందడం ద్వారా తాము ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటే ఆ రంగంలో ఉన్నతి సాధించడానికి ఆ పరిజ్ఞానం ఉపయోగ పడుతుందదాని గ్రహించరు.

అదే విధంగా నేటి కాలంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, ఇతర గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులు కానీ తమ చదువు పూర్తయిన తరువాత మళ్ళీ తాము కళాశాలలో చదివిన విషయాలకు సంబంధించిన కోర్సులు చేయడం కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కళాశాలల్లో చదివే సమయంలోనే వారి విషయానికి సంబంధించిన పూర్తిస్థాయి జ్ఞానాన్ని ఆర్జించకుండా, పట్టభద్రులై సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు గానీ తమకు విషయ పరిజ్ఞానం లేదని తెలుసుకోలేకపోతున్నారు. సరైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోలేక సతమతమవుతున్నారు. ఇటువంటి వారికి తాము అనుకున్న రంగంలో ఉద్యోగావకాశాలు లభించడం కష్టప్రాయంగా మారుతుంది. పాఠశాలలకు, కళాశాలలకు మొక్కుబడిగా వెళ్ళిరావడం వలన వారికి గాని, వారి కుటుంబానికి గానీ, సమాజానికి గానీ, దేశానికి గానీ ఎటువంటి ప్రయోజనం లేదు. వారి విద్యాభ్యాసంలో, చేపట్టబోయే వృత్తికి సంబంధించిన కౌశలాన్ని సాధించడమే దీనికి సరైన పరిష్కారం. వారి సమస్యకు పరిష్కారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది.