వ్యక్తిత్వ వికాస కథలు
ప్రతి మనిషిలో ఒక ప్రత్యేక సామర్థ్యం, నైపుణ్యం ఉంటాయి. ఒకే పనిని ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే లాగా చేయలేరు. సామర్ధ్యం విషయంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సరికాదు. అందుకే ఎవరికి వారే గొప్పవారుగా భావించుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం వలన ఆత్మన్యూనతా భావన కలుగుతుంది. ఇతరులు చేయగలిగిన పనిని మనం ఏ విధంగానైతే సమర్ధంగా చేయలేమని భావిస్తామో, మనం చేసే పనిని ఇతరులు చేయలేరనే భావనతో ఉండాలి. అప్పుడే మనకి మనం ప్రత్యేకంగా కనిపిస్తాము. ఈ విషయాన్ని ధృవ పరిచేందుకు ఇక్కడ ఒక చిన్న కథను చూద్దాం...
ఒక అడవిలో ఏనుగు, చిరుతపులి, కోతి, ఎలుక మంచి స్నేహితులు. ఒకరోజు వాటిలో తమలో ఎవరు గొప్ప అనే సందేహం కలిగింది.
ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి అడవికి రాజైన సింహం వద్దకు బయల్దేరాయి. సింహం వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పాల్సిందిగా అడిగాయి. దానికి సింహం “మీకు నాలుగు పరీక్షలు పెడతాను, ఎవరు ఎక్కువ పరీక్షల్లో గెలుస్తారో వారే గొప్ప వారు” చెప్పింది.
మొదటగా ఆ నలుగురిని దగ్గరలో ఉన్న ఒక మామిడిచెట్టు ఎక్కి మామిడికాయలు కోయాల్సిందిగా సింహం చెప్పింది. ఒక్క గెంతులో కోతి చెట్టుపైకి ఎక్కి మామిడికాయలు కోసి తెచ్చి సింహం ముందుంచింది. మిగతా మూడు జంతువులు కోతి నైపుణ్యానికి అవాక్కయ్యాయి. గర్వంతో వాటిని చూస్తూ కోతి “ఇప్పకటికైనా నమ్ముతారా మీకన్నా నేనే గొప్పదానిని అని” అంటూ హేళనగా మాట్లాడింది.
అది గమనించిన సింహం “అప్పుడే ఏమైంది. ఇంకా మూడు పరీక్షలున్నాయి వాటిలో కూడా నువ్వే గెలిస్తే అప్పుడు సంబర పడుదువు గానీ” అన్నది.
ఈసారి సింహం ఆ నలుగురిని పెద్ద పెద్ద చెక్కదుంగల దగ్గరికి తీసుకుని వెళ్ళి వీటిలోనుండి కనీసం ఒక దుంగను ఎత్తి అవతలి పక్కకి ఎవరు వేస్తారో వారే గొప్ప అని చెప్పింది.
ఏనుగు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ఒకేసారి రెండు చెక్కదుంగలను ఎత్తి పక్కకి విసిరింది. మిగతా మూడు కలిసి ఒక దుంగను కూడా కదిలించలేకపోయాయి. అత్యుత్సాహంతో ఘీంకరిస్తూ ఏనుగు మిగతా ముగ్గురిని చులకనగా చూసింది.
మూడవ పరీక్షగా సింహం “ఇక్కడికి సుమారు మూడు మైళ్ళ దూరంలో ఒక నల్లబండరాయి ఉంది. దాని పక్కనే ఒక వెదురు కర్ర పాతి ఉంటుంది. దానిని ఎవరు త్వరగా తీసుకుని వస్తారో వారే గొప్పవారు” అని చెప్పింది.
సింహం మాటకూడా పూర్తికాకముందే వాయువేగంతో చిరుతపులి పరుగెత్తికెళ్ళి మిగతా మూడు ఆ ప్రదేశానికి వెళ్ళక ముందే ఆ కర్రను తెచ్చి సింహం ముందు పెట్టింది.
మిగతా మూడింటిని చూసూ చిరుతపులి "చూశారా నావేగం. వేగంగా పరిగెత్తడంలో నాతో పోటీపడే వారు ఎవరూలేరు, మీరెంత ప్రయత్నించినా నా అంత వేగంగా ఈ జన్మకు పరుగెత్తలేరు” అని అన్నది.
మధ్యలో సింహం కల్పించుకుని "సరే ఇక చివరి పరీక్షలో ఎవరు గెలుస్తే వారే గొప్పవారు. అందుకు గాను మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. పక్కనున్న పొదను ఆనుకుని వేటగాడు వేసిన ఒక వలలో పావురాలు చిక్కుకున్నాయి. వేటగాడు దగ్గరలో ఉన్న కొలనుకు నీటి కోసం వెళ్ళాడు. అతను వచ్చే లోపు పావురలను ఎవరు బంధ విముక్తులను చేస్తే వారే గొప్పవారు” అని చెప్పింది.
ఆ మాట విన్న వెంటనే ఎలుక వేగంగా వెళ్ళి తన పదునైన పళ్ళతో పావురాలు చిక్కుకున్న వలను టక టకా తెంపేసి వాటిని బంధ విముక్తుల్ని చేసింది. మిగతా మూడు ఇంత చిన్నదైన ఎలుక అంత త్వరగా వలను ఎలా తెంపింది అని ఆశ్చర్యపోయాయి.
ఆ నలుగురిని ఉద్దేశించి సింహం “ఇప్పుడు చెప్పండి మీలో ఎవరు గొప్ప. నాలుగు పరీక్షల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పరీక్ష గెలిచారు. అంటే అందరూ గొప్పవారే అని అర్ధం కదా. సృష్టిలో ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. అంతేగానీ మనం చేసే పని ఎదుటివారు చేయలేరు కాబట్టి వారు మనకన్నా తక్కువ అనే భావన సరికాదు. వారి నైపుణ్యత వారికి ఉంటుంది. వారు చేసే పనిని మనం చేయలేకపోవచ్చు. కాబట్టి ప్రతిఒక్కరు ఒక విశిష్ట స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు” అని చెప్పడంతో ఆ నాలుగు జంతువులు సంతోషంతో తమ ఇళ్ళకు బయల్దేరాయి.
పైన చెప్పన కథ ఆధారంగా బోధపడే విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎవరికి ఎవరూ పోటీదారులు కారు. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా వృత్తిపని వారు కావచ్చు. ఎవరి నైపుణ్యత వారికి ఉంటుంది. ప్రతి మనిషిలో అంతర్గతంగా నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని సరైన సమయంలో సరైన ప్రదేశంలో బయటికి తీస్తే ప్రతి ఒక్కరూ తమ రంగంలో విజేతలయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.