విజయం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిఉండడమే విజయరహస్యం


మనసా, వాచా, కర్మణా ఎవరైతే విజయాన్ని సాధించగలమని విశ్వసిస్తారో వారు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. విజయం సాధిస్తామా లేదా అనే సంశయంతో ఉన్నవారెప్పటికీ విజయం సాధించలేరు.

చిత్రకళ పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉన్న ఒక యువకుడు చిన్ననాటి నుండి స్వంతంగా చిత్రకళ సాధన చేస్తుండేవాడు. ఏదో ఒకరోజు గొప్ప చిత్రకారుడవ్వాలనేది అతడి కోరిక. చిత్రకళలో గొప్ప ప్రావీణ్యత కలిగిన ఒక గురువుగారు ఆ యువకుడు నివసించే ఊరికి వచ్చి, తన శిష్యులు వేసిన చిత్రాలతో కూడిన చిత్రకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. యువకుడికి ఎలాగైనా సరే ఆ గురువుగారి వద్ద శిష్యరికం చేసి గొప్ప చిత్రకారుడిగా పేరుతెచ్చుకోవాలనే కోరిక కలిగింది. అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి తాను అంతకు ముందు వేసిన చిత్రాలను చూపి ఆయనతో “నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుకున్నాను దయచేసి నన్ను మీ శిష్యబృందంలో చేర్చుకోండి” అని అభ్యర్ధించాడు. అందుకు బదులుగా గురువుగారు “నువ్వు ఎప్పటికీ ఒక మంచి చిత్రకారుడివి కాలేవు” అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో ఆ యువకుడు నిరుత్సాహంతో వెనుదిరిగాడు. గురువుగారు అన్న మాటలు మనసులో నాటుకుపోయి, ఇక తానెప్పటికీ మంచి చిత్రకారుణ్ణి కాలేనని భావించి ఏకంగా తన చిత్రకళ సాధననే మానివేశాడు.

ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అదే గురువుగారు మళ్ళీ యువకుడు నివసించే ఊరిలో చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి రావడం జరిగింది. యువకుడు కూడా చిత్రకళ ప్రదర్శనను సందర్శించడానికి వెళ్ళాడు. ప్రదర్శనకు ఉంచిన చిత్రాలను చూసి యువకుడు అక్కడే ఉన్న గురువుగారిని కలిసి “గతంలో నేను మీ వద్ద చిత్రకళ నేర్చుకుంటానంటే నేను ఎప్పటికీ గొప్ప చిత్రకారుడివి కాలేవు అని నన్ను అవమానించారు. ఇప్పుడు మీ శిష్యులు వేసిన చిత్రాలు కూడా ఏమంత గొప్పగా లేవు దీనికి మీరేం సమాధానం చెబుతారు” అని ప్రశ్నించాడు. అప్పుడు గురువుగారు చిరు మందహాసంతో “నా దగ్గరికి వచ్చి చిత్రకళ నేర్పమని అడిగిన ప్రతి ఒక్కరికీ నేను నీకు చెప్పిన విధంగానే గొప్ప చిత్రకారులు కాలేరనే చెబుతాను” అన్నారు. ఆ యువకుడు ఒకింత ఆశ్చర్యానికిలోనై ఎందుకలా చెబుతారు. మీరలా చెప్పబట్టే కదా నేను నా చిత్రకళ సాధనను కూడా మానివేశాను. మీరలా చెప్పకుండా ఉంటే కనీసం నేను స్వంతంగానే సాధనచేసి గొప్ప చిత్రకారుడినయ్యేవాణ్ణి” అని నిష్ఠూరంగా అన్నాడు.

అప్పుడు గురువుగారు “నీకు గొప్ప చిత్రకారుడయ్యే పట్టుదలే ఉంటే నా మాటకు విలువనిచ్చేవాడివే కాదు. నేనన్న మాటలకి పౌరుషంతో ఇంకా బాగా ప్రయత్నం చేసి నిజంగానే గొప్ప కళాకారుడివయ్యేవాడివి. ఏదైనా రంగంలో ఉన్నతి సాధించాలంటే కేవలం కష్టపడేతత్వం ఒక్కటి ఉంటే సరిపోదు, ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. నీలో ఆత్మవిశ్వాసం లేనందుకు నా మాటను నమ్మి నువ్వు నీ సాధన మానేసావంటే నీ మనస్సెంత బలహీనమైనదో అర్థమవుతోంది. గొప్ప చిత్రకారుడిని కాగలనని ముందు నువ్వు బలంగా విశ్వసిస్తేనే అది జరుగుతుంది. మరొకరి మాటను నమ్మి నీ మీద నువ్వు నమ్మకం కోల్పోయి, సాధన మానేసి గొప్ప చిత్రకారుడయ్యే అవకాశం కోల్పోయావు” అన్నారు. ఆ మాటలకి యువకుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇప్పటి వరకూ అనేక రంగాలలో విజయం సాధించిన వారిని మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ తాము సాధించబోయే విజయం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నవారే. వారు చేయబోయే ప్రయత్నాలకు ముందే తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని విశ్వాసంతో ఉండడంలోనే వారి విజయ రహస్యం దాగి ఉన్నది.