మీ విలువ తెలుసుకోండి...

సాధారణంగా మనందరం పనిచేసే చోట గుర్తింపు లేదనో, మన చుట్టూ ఉన్న మనుషులు విలువనివ్వట్లేదనో బాధపడుతుంటాము. కాని అటువంటి ప్రదేశాల్లో లేదా అటువంటి మనుషుల మధ్య ఉంటూ మనకు మనమే విలువ లేకుండా చేసుకుంటున్నామని మాత్రం గ్రహించం. గుర్తింపు, విలువ లేని చోట మనమే ఉంటూ మనం వాటిని ఆశించడం ఎంతవరకు సమంజసం. 

చదువు పూర్తిచేసిన కొడుకుకు తండ్రి తన పాత కారునొకదాన్ని బహుమతిగా ఇస్తూ...

“నేను బహుమతిగా ఇచ్చిన కారు చాలా పాతది. ఒక వేళ నీకు నచ్చకపోతే దానిని ఎంతో కొంత ధరకు అమ్మి అందులో మరికొంత సొమ్ము కలిపి కొత్తది కొనుక్కో” అని సలహా ఇచ్చాడు.

ఆ కారును అమ్మడానికి ముందు అసలు దాని విలువ ఎంతనో కనుక్కొని ఆ తరువాత దానిని అమ్మాల్సిందిగా కూడా చెప్పాడు. 

తండ్రి మాట ప్రకారం కొడుకు కొత్త కార్లను అమ్మే డీలర్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న కారు విలువ ఎంతనో చెబితే దానికి మరికొంత జోడించి కొత్త కారు కొనాలనుకుంటున్నట్లు చెప్పాడు.  ఆ డీలర్ “ఇది చాలా పాత కారు. అసలు ఈ కాలంలోని సరికొత్త కార్లతో పోలిస్తే దీనికి పెద్దగా విలువ ఉండదు. దీని ధర ఒక లక్ష మాత్రమే పలుకుతుంది" అని చెప్పాడు.

కొడుకు తండ్రి వద్దకు వచ్చి అదే మాట చెప్పాడు. దానికి తండ్రి “ఒకసారి పాత కార్లు కొనే వ్యక్తి వద్దకు వెళ్లి దాని ధర ఎంత పలుకుతుందో అడుగు” అని చెప్పాడు.

దానికి కొడుకు సరేనని పాత కార్లు కొనే వ్యక్తి వద్దకి వెళ్లి తన కారుధర ఎంత పలుకుతుందని అడిగాడు.

ఆ వ్యక్తి “ఇది పూర్తిగా పాత కారు దీనికి పెద్ద విలువ లేదు. దానికి తోడు దీని విడి భాగాలు కూడా ఎక్కడా దొరకవు కాబట్టి దీని ధర యాభై వేల కన్నా ఎక్కువ పలుకదు” అని చెప్పాడు.

కొడుకు తండ్రి వద్దకు వెళ్లి అదే మాట చెప్పాడు.

ఈసారి తండ్రి కొడుకును అరుదైన పురాతన కార్లు కొనే ఒక కార్ల క్లబ్ కి వెళ్లమని చెప్పాడు.

కొడుకు సరేనని కార్ల క్లబ్ కి వెళ్ళి తన కారును చూపించి దానికి ఎంత ధర పలుకుతుందో చెప్పమని అడిగాడు.

క్లబ్ సభ్యులు దానిని ఆశ్చర్యంగా చూసి ఇంత అద్భుతమైన కారు మేమింత వరకు చూడలేదు. అత్యంత అరుదైన ఈ కారుకి ఎంత ధరకట్టినా తక్కువే అని చెప్పి, చివరికి కోటి రూపాయలకు కొనడానికి సిద్దమైనారు.

తండ్రి వద్దకు వెళ్లి కొడుకు అదే విషయాన్ని చెప్పాడు. దానికి తండ్రి చిరు మందహాసంతో...

“నేను నిన్ను కేవలం కారు అమ్మడానికి మాత్రమే పంపలేదు. దీని ద్వారా నీకొక జీవిత పాఠం నేర్పించదలచాను” అన్నాడు. అదేమిటని కొడుకు అడగగా..

“ఎక్కడైతే నీకు తక్కువ విలువ ఉంటుందో, నీకు నీ పని తనానికి సరైన విలువ, గుర్తింపు, గౌరవం ఉండవో అక్కడ ఎన్నటికీ పనిచేయకూడదు. నిజంగా నీకు నీ పనితనానికి సరైన గౌరవం, విలువ ఉంటాయో అక్కడ మాత్రమే పని చేయాలి. అదే నీకు సరైన ప్రదేశం. నీకు గుర్తింపు లేని ప్రదేశంలో ఉండి బాధపడడం కంటే నిన్ను గుర్తించే చోట ఉండడం నీకు విలువను చేకూరుస్తుంది. అదే విధంగా నీకు విలువ ఇవ్వని మనుషుల మధ్య సైతం ఉండకూడదు. ఎవరైతే నీకు విలువనిచ్చి గౌరవిస్తారో వారి మధ్యనే ఉండాలి” అని చెప్పాడు.

అందుకే తగిన గుర్తింపు, విలువ లేని చోట ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయడం, విలువనివ్వని మనుషుల మధ్య బ్రతకడం మరణంతో సమానం. అటువంటి చోట ఉండడం అంటే మన విలువను మనమే తగ్గించుకున్నామన్న మాట. ఏ మనిషి కూడా తన విలువను తానే తగ్గించుకోవడానికి ఇష్టపడడనేది మనందరికీ తెలిసిన విషయం.