మన యుద్ధభేరిని మనమే మోగించాలిఒక రాజుగారివద్ద యుద్ధరంగంలో పోరాడే ఏనుగులు చాల ఉన్నాయి. అయితే వాటిలో ఒక ఏనుగు యుద్ధరంగంలో అత్యంత చాకచక్యాన్ని, నైపుణ్యతను ప్రదర్శించి తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగిఉండేది. ఆ ఏనుగంటే రాజు గారికి అమితమైన అభిమానం. ఏ యుద్ధంలో పాల్గొన్నా ఆ ఏనుగు విజయం సాధించే దాకా వెను దిరిగేదికాదు. ఒకవేళ యుద్ధంలో సైనికులు ఓటమి పాలైతే, రాజ్య పొలిమేరలలోనే ఆగిపోయి మళ్ళీ యుద్ధం జరిగి విజయం సాధించేదాకా రాజ్యంలోకి వెళ్ళేది కాదు. 


ఇదిలా ఉండగా కాలక్రమేణా ఆ ఏనుగుకు  వయసు మీదపడడంతో రాజుగారు ఇకపై ఆ ఏనుగును యుద్ధంలో ఉపయోగించరాదని సైనికులను ఆజ్ఞాపించారు. అయితే ఆ ఏనుగుపై గల మక్కువతో రాజుగారు దానికి కావాల్సిన ఆహార పదార్థాల్ని, వసతి సౌకర్యాల్ని కల్పించాలని కూడా భటులను ఆదేశించారు. 


సకల సౌకర్యాలు కల్పించినప్పటికీ యుద్ధం అంటే మక్కువ కలిగిన ఏనుగు తనకు వయసైపోయిందని, ఇక తాను యుద్ధం చేయలేనని, మిగిలిన జీవితం మొత్తం నిస్సారంగా గడపాల్సిందనే భావనతో రోజు రోజుకు కుంగిపోసాగింది. 


ఒక రోజు ఏనుగు నీరు త్రాగడానికి దగ్గరలో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళింది, అనుకోకుండా దాని కాళ్ళు సరస్సులో గల  బురదఊబిలో కూరుకుపోయాయిఏనుగు శారీరికంగా ఎంత బలమైనదైనప్పటికీ, మానసికంగా తాను ముసలిదాన్ని అయిపోయాననే భావనలో ఉండడం వల్ల యెంత ప్రయత్నం చేసినా బైటికి రాలేకపోతోంది. అది బైటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా దాని మానసిక స్థితి అది మరింత లోపలికి కురుకుపోయేలా చేస్తోంది. 


ఏనుగుకు వచ్చిన ఈ విషమ పరిస్థితి భటుల ద్వారా విన్న రాజుగారు, వెంటనే అక్కడికి వచ్చి ఎలాగైనా ఏనుగును ఊబిలోంచి బైటికి లాగాలని ప్రయత్నం చేయసాగారు. యెంత ప్రయత్నం చేసినా ఏనుగు ఇంకా లోనికి వెళ్తోంది కానీ బైటికి రావడం కుదరడంలేదు. 


దిక్కుతోచని స్థితిలో రాజుగారు ఉన్న సమయంలో, అటువైపు నుంచి ఒక సాధువు వెళ్తూ, అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి, అసలేం జరిగింది అని రాజుగారిని ప్రశ్నించాడు. రాజుగారు జరిగిందంతా చెప్పి ఏనుగును రక్షించే ఉపాయం ఏదైనా చెప్పమని సాధువును ప్రార్థించారు.

 

సాధువు రాజుగారికి యుద్ధ రంగంలో ఉపయోగించే యుద్ధభేరీలు, విజయఢంకాలు ఇంకా ఇతర సామాగ్రి తెప్పిస్తే తాను ఏనుగును కాపాడగలనని చెప్పాడు. రాజుగారు సాధువు చెప్పిన అన్ని పరికరాలు తేవాల్సిందిగా  భటులకు  పురమాయించారు.  


భటులు ఏనుగు ఉన్న ప్రదేశానికి పరికరాలన్నీ తీసుకు రాగా, యుద్ధ సమయంలో ఏ విధంగానైతే భేరీలు, ఢంకాలు మోగిస్తారో అదే విధంగా మోగించాల్సిందిగా సాధువు చెప్పాడు. సాధువు చెప్పిన దాని ప్రకారం చెవులు చిల్లులు పడేలా యుద్ధ భేరీలు, ఢంకాలు  మొగసాగాయి. కొంత సేపటికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయేలాగా ఏనుగు ఎవరి సహకారం లేకుండా తనకు తానుగా ఊబి నుండి బైటికి వచ్చేసింది. 


రాజుగారు ఆనందంతో సాధువుకు నమస్కరించి అదెలా సాధ్యమైంది అని అడగగా, దానికి సాధువు నిత్యం యుద్ధ రంగంలో ఉత్సాహంగా ఉండే ఏనుగు, తనకు వయసై పోయిందనే విషయాన్నీ జీర్ణించుచుకోలేక, ఇక తాను ఎందుకూ పనికి రానానే భావనతో ఉండడం వల్ల ఊబిలోంచి పైకి వచ్చే ప్రయత్నం చేయలేకపోయింది. అదే ఏనుగుకు యుద్ధరంగ వాతావరణం సృష్టించడంతో తాను తిరిగి యుద్ధం చేయగలననే ధీమాతో తనంతట తాను బైటికి రాగలిగిందని చెప్పాడు. 


ఇకపై తాము చేయబోయే అన్ని యుద్ధాలకు ఆ ఏనుగును సైతం తీసుకు వెళ్లాలని రాజుగారు సైన్యాధిపతిని ఆదేశించాడు. అప్పటి నుంచి మరణించే దాకా ఆ ఏనుగు యుద్ధాలు చేస్తూనే ఉన్నది.


ఈ కథని పరిశీలిస్తే మనం కూడా చాలాసార్లు ఏనుగులాగే నిరాశా, నిస్పృహలనే ఊబిలో కూరుకు పోయి బైటికి రాలేకపోతాము. యెంత ప్రయత్నించినా ఇంకా లోపలికి పోతామే తప్ప బైటపడడం దుర్లభంగా అనిపిస్తుంది. అయితే అదే సమయంలో మనలో ఉండే యుద్ధభేరీలు, విజయఢంకాలు మోగితే నిరాశా, నిస్పృహల నుంచి బైటపడగల మార్గం తప్పకుండా కనిపిస్తుంది. మనచుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని యుద్ధభేరీలు మోగించినా ఒక్కోసారి మనం ఊబినుంచి బైటపడలేము. ఎందుకంటె మనల్ని ఊబిలోంచి బైటకు తీయడానికి కావాల్సిన భేరీలు, ఢంకాలు ఏవో మనకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు కాబట్టి. 


ఇటువంటి పరిస్థితిలో  మన యుద్ధభేరి, విజయ ఢంకాలు మనమే మోగించాల్సి ఉంటుంది. అప్పుడే నిరాశా, నిస్పృహలనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్న మనం ఆ స్థితి నుంచి బైటపడి, జీవన సమరంలో పోరాడి విజయాన్ని సైతం సొంతం చేసుకోగలం. కాకపోతే మనలో ఉన్న ఈ యుద్ధభేరీలు, విజయఢంకాలు ఏమిటనేది మనకు మనంగా గుర్తించాల్సి ఉంటుంది. అవి గతంలో మనం సాధించిన విజయాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో జీవితంలో గెలవడానికి మనం ప్రదర్శించిన పోరాట పటిమ కావచ్చు, అత్యంత కష్టతరమైన పరిస్థితుల నుండి మనల్ని మనం బైటికి తీసుకువచ్చిన విధానం కావచ్చు, మరే ఇతర అంశమైనా కావచ్చు. 


మొత్తానికి... మన యుద్ధభేరీ మనమే మోగించాలి... జీవితాంతం విజయాలు సాధిస్తూ సాగాలి.