ఆత్మవిశ్వాసంతో కొండల్ని సైతం పిండి చేయగలం

ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి - దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం, ఆ ఆలోచనతో నిండిపోనివ్వండి...ప్రతి ఇతర ఆలోచనలను వదిలివేయండి... ఇదే మీ విజయానికి సరైన మార్గం.

- స్వామి వివేకానంద


"ఆత్మవిశ్వాసంతో కొండల్ని సైతం పిండి చేయగలం .... "
ఇది నిజమని ఒక వ్యక్తి రుజువు చేసాడు.....
ఒక్కడే 22 సంవత్సరాలు అలుపెరుగక పెద్ద కొండను సైతం పిండి చేసాడు...
తాను అనుకున్నది పూర్తి చేసే వరకు నిరంతరం గమ్యం వైపు సాగాడు...
చివరికి లక్ష్యం సాధించాడు....


అతడి పేరు దశరథ్‌ మాంజీ. ప్రస్తుతం అతడు  “ది మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా పిలువబడుతున్నాడు. అతడికి ఈ బిరుదు రావడం వెనుక అతడి 22 ఏళ్ళ కష్టంతో పాటు ఓర్పు, సహనం కూడా ఉన్నాయి.


మాంజి బీహార్ లోని గెహ్లార్ గ్రామంలో జన్మించాడు. ఆతను తన చిన్న నాటి నుంచి గనుల్లో కార్మికుడిగా పని చేశాడు. అతడికి ఫల్గుణి అనే యువతితో వివాహం జరిగింది.


బీహార్‌ రాజధాని పాట్నాకు దాదాపు 100 కి.మీ దూరాన ఉన్న ఓ చిన్న పల్లెటూరు గెహ్లార్‌. బయటి ప్రపంచానికీ ఆ గ్రామానికీ మధ్య ఓ కొండ అడ్డం ఉంటుంది. గెహ్లార్‌ వాసులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలనుకున్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం వారు సుమారుగా 32 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఈ కొండను తొలిస్తే 32 కి.మీ. మార్గం కాస్తా మూడు కిలో మీటర్ల మార్గంగా మారుతుంది. అయితే మారుమూల పల్లె కాబట్టి ప్రభుత్వం సైతం దాన్ని పట్టించుకోలేదు.


కొండకు దగ్గరలోనే దశరథ్ మాంజీ ఒక క్వారీలో పని చేసేవాడు. ఓ రోజున మధ్యాహ్న సమయంలో మాంజీకి అతడి భార్య ఫల్గుణి భోజనం తీసుకుని వెళ్తూ కొండమీద నుండి జారీ కిందకి పడిపోయింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఫల్గుణి కింద పడిన విషయం గ్రామస్తుడి ద్వారా దశరథ్ మాంజీకి తెలిసింది. అతడు తానూ చేస్తున్న పనిని వదిలి వెంటనే పరుగు పరుగున వచ్చి చూసే సరికి అతడి భార్య ఒళ్లంతా రక్తంతో తడిసి ముద్దయి పోయి ఉన్నది. ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంటే మార్గమధ్యలోనే ఆమె అసువులు బాసింది. భార్య మరణం మాంజీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తరువాత తేరుకుని తన భార్యను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళితే ఆమె తప్పక బతికేది, అయితే కొండ చుట్టూ తిరిగి వెళ్లే సరికి ఆమె ప్రాణం పోయింది కాబట్టి, తన లాంటి పరిస్థితి గ్రామంలో మరెవరికి రాకూడదని నిర్ణయించుకుని ఆ కొండను తొలచి మార్గం చేయాలనీ మాంజీ ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు. తన వద్ద గల గొర్రెలు అమ్మి.. సమ్మెట, ఉలి, గునపాన్ని కొన్నాడు. 300 అడుగులు ఎత్తైన కొండను తొలిచే పనిని ప్రారంభించాడు.మాంజీ కొండను తవ్వే పని చేస్తుంటే  గ్రామస్తులు అతడిని చూసి భార్య మరణంతో మతి భ్రమించిందని నవ్వసాగారు. అయితే మాంజీ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైనాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో శ్రమించి చివరికి కొండను తవ్వడం పూర్తి చేసాడు. అయితే అతడు కొండను తవ్వడం ప్రారంభించిన పది సంవత్సరాల తరువాత కొంతమంది గ్రామస్తులు అతడికి సాయం చేశారు.  అతడి పట్టుదలతో ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో ఓ చక్కటి మార్గం ఏర్పడింది. ఓ సామాన్యుడు నిర్విరామ కృషితో పర్వతాన్ని జయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. ప్రస్తుతం చుట్టు పక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు అదే దారి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. 2011లో బీహార్ ప్రభుత్వం ఈ మార్గానికి  'దశరథ్ మాంఝీ పాత్' అని పేరును కూడా పెట్టడం జరిగింది.


సహనం, పట్టుదల, కృషి ఉంటే.. ఎంతటి కఠినమైన కార్యాన్ని అయినా పూర్తి చేయచ్చు అనడానికి మాంజి  జీవితం మంచి ఉదాహరణ. ఒక మనిషి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి కొండను తొలిచాడు అంటే, చిన్న చిన్న సమస్యలు ఎదురవగానే జీవితం ముగిసి పోయినట్లు భావించే వారికి దశరథ్ మాంజీ జీవితం ఒక చక్కటి ప్రేరణ. 


కొన్నిసార్లు మనం అనుకున్నది సరైన సమయంలో జరగక పోయినా, ఓర్పుతో ముందుకు వెళితే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనమే పూర్తి చేస్తాం. అయితే ఇక్కడ చేయాల్సింది పట్టుదలతో ముందుకు సాగడం మాత్రమే..