ప్రత్యామ్నాయాలు కూడా విజయసాధనకు అవరోధాలే

ఒక్కోసారి మనకు గల ప్రత్యామ్నాయాలే మన విజయ సాధనకు అవరోధాలవుతాయి. ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి ఇతర ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారిస్తే అతను ఎన్నటికీ తన లక్ష్యాన్ని చేరలేడు. అందుకు గాను మన ప్రత్యామ్నాయాలను మనమే నాశనం చేసుకొని విజయం వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. విజయం కోసం శ్రమిస్తున్న తరుణంలో కేవలం విజయం గురించి ఆలోచించాలే తప్ప, అపజయం కలిగితే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాల గురించి కాదు. అలా ఆలోచిస్తే మనకు ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి, విజయం లభించక పోయినా ఫరవాలేదనే భావన మనసులో కలుగుతుంది. ఎప్పుడైతే ఈ భావన మనసులో కలిగిందో మనం విజయం సాధించడం మీద దృష్టిని నిలపలేము. విజయసాధనలో మనం అనుకోకుండా కలిగిన ఏవైనా చిన్న లక్ష్యాలను పూర్తిచేస్తే తప్పులేదు. అవి మనకు ఇంకా ప్రేరణను కలిగిస్తాయి. కానీ ముందుగానే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవడం వలన అవి మన లక్ష్యానికి అవరోధాలుగా మారతాయి.


ఒక రాజు తన సేనతో కలిసి శతృదేశంపై దండెత్తి యుద్ధానికి బయల్దేరాడు. శతృదేశంతో యుద్ధం చేయాలంటే అతను ఒక నదిని దాటి అవతలి తీరానికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు వారు తమ రాజ్యం నుంచి పడవల ద్వారా శతృదేశం ఆవలి ఒడ్డుకు చేరుకున్న తరువాత ఆ పడవలని కాల్చివేయాల్సిందిగా తన సైనికులను ఆజ్ఞాపించాడు. ప్రభువు ఆజ్ఞ పాటించి సైనికులు తమ పడవలను కాల్చి బూడిద చేశారు. అప్పుడు ఆ రాజు తన సైనికులనుద్దేశించి “ఇప్పుడు మనకు తిరిగి మన రాజ్యానికి వెళ్ళడానికి పడవలు లేవు. మనం యుద్ధంలో విజయం సాధిస్తేనే శతృరాజ్యంలోని పడవల సహాయంతో వెనక్కి వెళ్ళగలం” అన్నాడు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఆ యుద్ధం గెలిచి తీరాలని ఆ సైనికులకు అర్థం అయింది. వారు అత్యుత్తమ పోరాట పటిమను ప్రదర్శించి చివరికి యుద్ధంలో విజయం సాధించారు. విజయం సాధించడంలో ప్రత్యామ్నాయం ఉండరాదనడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ.

ఒక పోరాటమంటూ మొదలైన తరువాత విజయంపై మాత్రమే దృష్టి నిలపాలి. ఇతర ప్రత్యామ్నాయాల కోసం ఆలోచిస్తూ కూర్చోవడం, ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకొనే పనిలో భాగంగా కాలాన్ని వృధా చేయడం తగదు. తమదృష్టి కేవలం లక్ష్యంమీద నిలిపిన వారు మాత్రమే సదా విజయులవుతారు.