సానుకూల దృక్పథం


ప్రతికూలతలు ఆవరించినప్పుడు మన మనసు పరిపరి విధాల ఆలోచనలతో మునిగి తేలుతుంటుంది. దాని కారణంగా ఒక్కోసారి మన కళ్ళెదుట ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకుంటాము. అదే సమయంలో సానుకూల ఆలోచనలు చేయగలిగితే మనం ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొని విజయాలు సాధించగలము. సానుకూల ఆలోచనా దృక్పథం అలవరచుకోవడం వలన ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతికూల ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఉంటాయి. సానుకూల దృక్పథం మన జీవితానికి ఎంత అవసరమో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం....

ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఖాళీగా ఉన్న మేనేజర్ ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వగా చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని దరఖాస్తులను వడబోసి అందులోంచి కొంతమందిని ఎంపికచేసి వారందరికీ సంస్థవారు రాతపరీక్షలు నిర్వహించారు. రాతపరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు అభ్యర్థులను మాత్రం మౌఖిక పరీక్షకు ఎంపిక చేశారు. ఇద్దరు అభ్యర్థుల్ని మౌఖిక పరీక్షకు పిలిచి వారి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రక రకాల ప్రశ్నలు వేశారు. చివరగా వారిద్దరికీ చేరొక కాగితాన్నిచ్చి గత సంవత్సర కాలంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను రాతపూర్వకంగా తెలియజేయాల్సిందిగా చెప్పారు.


మొదటి అభ్యర్థి...

“గత ఏడాది అనుకోని పరిస్థితుల్లో నా ఉద్యోగం పోయింది.దానితో నా పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. నిజానికి అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగం నాకిష్టం లేదు. కానీ కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరి పరిస్థితిలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. గత సంవత్సరం నుండి దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. తెలిసిన వారి దగ్గర అప్పులు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాను. తరచూ అప్పులు అడగడం వలన ఎవరూ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. నాతో మాట్లాడడానికి కూడా తెలిసిన వారెవరూ ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితి వల్ల నా మెదడు పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఏ పనీ చేయడానికి సహకరించడం లేదు. ఇప్పుడు కూడా ఈ ఉద్యోగం వస్తుందో రాదో అని భయంగా ఉన్నది. ఒక వేళ ఈ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితిని తలుచుకుంటేనే ఆందోళనగా ఉన్నది” అని ముగించాడు.

రెండవ అభ్యర్థి ....

“గత ఏడాది నేను పనిచేస్తున్న కంపెనీ అనుకోని పరిస్థితుల్లో మూతబడింది. నాతో సహా అందులో పనిచేసే వారందరూ ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం పోవడం నాకు తాత్కాలికంగా బాధ కలిగించింది. కానీ నిజానికి నా ఉద్యోగం పోవడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం వరకు నేను చేస్తున్న ఉద్యోగం నాకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ కంపెనీ మూతబడకకపోతే బహుశా జీవితమంతా నాకిష్టం లేని ఉద్యోగంలో రాజీపడుతూ పనిచేయాల్సి వచ్చేది. దాని వలన నా పనిలో నాణ్యత లోపించి, ఏదో ఒక రోజు కంపెనీ వాళ్ళే నన్ను ఉద్యోగంలోంచి తీసేసేవారు. ఇప్పుడు ఉద్యోగం పోవడంతో నా ఆర్థిక పరిస్థితి దిగజారింది. అయినా కూడా ఉన్న కొంత డబ్బుతో నేను ఏ విధంగా బ్రతకగలనో నేర్చుకున్నాను. ఉద్యోగం పోయిన కారణంగా సంవత్సరం ఖాళీ దొరకడంతో నేను నాకు ఇష్టమైన ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్ని నేర్చుకోలిగాను. ఒక్కోసారి నాకు డబ్బు అవసరమైన సందర్భంలో తెలిసిన వారిని అడగాల్సి రావడంతో కొంతమంది ముఖం చాటేసేవారు. ఆ కారణంగా చాలా మంది సన్నిహితులతో మాట్లాడడం తగ్గింది. తద్వారా నాకు బోలెడంత సమయం మిగిలింది. ఆ సమయాన్ని నేను నా నైపుణ్య శిక్షణకుగాను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాను. ఒక వేళ ఈ ఉద్యోగం నాకు రాకపోయినా నేను బాధపడను, భయపడను. నేను నేర్చుకొన్న నైపుణ్యాలతో మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను” అని పూర్తిచేశాడు.

మేనేజర్ ఉద్యోగానికి రెండవ అభ్యర్థి ఎంపికయ్యాడని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతనిలో ఉన్న సానుకూల దృక్పధమే అతడు ఉద్యోగాన్ని సాధించగలిగేలా చేసింది.

జీవితం నిత్యం పోరాటమయం. సమస్యలతో, ప్రతికూల పరిస్థితులతో సమరం సాగించాల్సి ఉంటుంది. అత్యుత్తమ పోరాట పటిమ ప్రదర్శించిన వారిదే విజయం. జీవితంలో విజయం సాధించాలంటే సానుకూల దృక్పథం చాలా అవసరం. విజయం సాధించే వారు భవిష్యత్తు పట్ల ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో జీవిస్తూ, ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పుడల్లా పరిస్థితులతో పోరాడే శక్తి రెట్టింపు అవుతుంది. సానుకూల దృక్పథం అలవపరచుకొని నిరంతర కఠిన శ్రమ, పటిష్ట ప్రణాళికతో జీవితంలో ముందుకు సాగేవారే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారు.