అపజయాన్ని అంగీకరించటం కూడా విజయానికి సోపానమే

సాధారణంగా మనలో చాలా మంది అపజయాలు ఎదురవగానే సాధించాలనుకున్న విజయం గురించి మరిచిపోయి అపజయం గురించి మదనపడుతూ ఉంటారు. అపజయాన్ని అంగీకరించడం విజయానికి సోపానమని గ్రహించరు. అపజయం అంగీకరించటమంటే ఒక అడుగు వెనకకు వేయడమే అనిపిస్తుంది కానీ నిజానికి అపజయం విజయానికి వారధిలాగా కూడా మారుతుంది. అపజయం తటస్థించడం తప్పేమీ కాదు దానివల్ల ప్రపంచం ఏమీ మునిగిపోదు. దానిని ఒక సహజ పరిణామంగా మాత్రమే భావించాలి. జగజ్జేతలందరూ అపజయాలు ఎదుర్కొన్నవరే. వారంతా తమ అపజయాలను అంగీకరించి, వాటిని విజయానికి సోపానాలుగా మార్చుకుని విజేతలుగా నిలిచారు. జీవితంలో అపజయాలు ఎదురుకాని విజేత లేడంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది వాస్తవం.

అపజయాలు ఎదురైనపుడు వాటిని అంగీకరించడం అలవాటు చేసుకోవడం ద్వారా మన మనస్సు తేలిక పడుతుంది. తరువాత చేయబోయే ప్రయత్నాలకు ఇది కావాల్సినంత పట్టుదలను పెంచుతుంది. అలా కాకుండా పరాజయం గురించే ఆలోచిస్తూ కూర్చోడవడం వల్ల మనస్సును నిరాశా, నిస్పృహలు ఆవహించి ముందుకు వెళ్ళలేని పరిస్థితిని కలుగజేస్తాయి. దీనివలన మరోకొత్త ప్రయత్నం చేయడానికి మనస్సు అంగీకరించకుండా మారిపోతుంది. ఒకవేళ ప్రయత్నించినా మళ్ళీ అపజయం కలుగుతుందేమోననే సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఒక్కోసారి పరాజయాన్ని అంగీకరించకపోతే మొండిపట్టుదలకు పోయి అదే సమస్యను పరిష్కరించడానికి అనవసర ప్రయత్నాలు చేయడం ద్వారా మరిన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మరిన్ని పరాజయాలు కలిగే అవకాశం ఉంటుంది.

అపజయాన్ని అంగీకరించడమంటే విజయం కోసం చేసే నిరంతర ప్రయాణం నిలిచిపోయిందని కాదు. అప్పటి వరకూ మనం ప్రయాణం చేస్తున్న దారి సరైనది కాదని, మనం వేరే దారిలో ప్రయత్నం చేయాలని మాత్రమే అర్థం. అంతేకానీ విజయ శిఖరాన్ని చేరాలన్న ప్రయత్నం ఆపివేయాలని కాదు. విజయం అంటే చేయి చాచగానే సునాయాసంగా లభించే వస్తువు కాదు. అనేక అపజయాల తరువాత మనకు దక్కే ఒక అపురూపమైన వస్తువు. అందుకుగాను నిరంతరం మనం చేస్తున్న కృషిలో భాగంగా ఎదురయ్యే అపజయాలను అంగీకరించినంత మాత్రాన కలిగే నష్టమేమీ లేదు.